సింహంలా గర్జించాడు ‘ బాజీ రావత్‌ ‘… 12 ఏళ్లకే దేశం కోసం ప్రాణాల‌ర్పించిన వీరుడు

-

‘నేను బతికున్నంతవరకు మీరు ఈ నది దాటలేరు’ గర్జించాడా చిన్నోడు. తుపాకీ మడమ దెబ్బలు, తూటాల రంధ్రాలతో నేలకొరిగిన ఆ బాలసింహం పేరు ‘ బాజీ రావత్‌ ’ Baji Rout.

Indian Freedom Fighter baji rout | బాజీ రావత్‌
Indian Freedom Fighter baji rout | బాజీ రావత్‌

ఒరిస్సాలోని ధేంకనల్‌ జిల్లా, నీలకంఠాపురం గ్రామంలో అక్టోబర్‌ 5, 1926న జన్మించాడు బాజీ రావత్‌. బీద ఖండాయత్‌ కుటుంబానికి చెందిన రావత్‌ తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో, తల్లి ఆ యింట్లో,  ఈ యింట్లో పనిచేస్తూ, బతుకులు వెళ్లదీస్తూండేది.

వాళ్లకు బ్రహ్మణి నది మీద ఒక నాటు పడవ ఉంది. దాన్ని బాజీ, ఇతర స్నేహితులు నడుపుతూ తల్లికి చేదోడువాదోడుగా ఉండేవాడు. ఒకనాడు బ్రిటిష్‌ సైనిక పటాలం ఒకటి అటువైపుగా వచ్చి, తమను నది దాటించాల్సిందిగా బాజీని బెదిరించారు. అయితే బాజీ అప్పటికే ఎంతో మంది అమాయక గ్రామీణులను చంపిన ఈ పటాలం గురించి వినివుండటంతో బాజీ వారిని నది దాటిస్తే, వెళ్లి గ్రామస్థులను చంపేస్తారని భయపడి నిరాకరించాడు.

(బాజీ రావత్‌కు నివాళిగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ పూరి బీచ్‌లో చెక్కిన సైకత శిల్పం)
(బాజీ రావత్‌కు నివాళిగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ పూరి బీచ్‌లో చెక్కిన సైకత శిల్పం)

దాంతో కోపం తెచ్చుకున్న సైనికులు, వెంటనే నది దాటించకపోతే చంపేస్తామని బెదిరించారు. అయినా చెక్కుచెదరని ధైర్యంతో కుదరదని చెప్పాడు. దాంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన ఓ సైనికుడు తన తుపాకీ మడమతో బాజీ తలపై మోదాడు. దాంతో బాజీ తల పగిలింది. రక్తమోడుతుండగా, బాజీ నేల వాలాడు. తిరిగి సన్నగిల్లుతున్న శక్తియుక్తులను కూడదీసుకుని లేచిన బాజీ, సింహంలా గర్జించాడు ‘‘నేను బతికున్నంతవరకు మిమ్మల్ని నది దాటనివ్వను’’. అంతే.. ఇంకో సైనికుడి తుపాకీ బాయినెట్‌ బాజీ తలలోకి దూసుకుపోయింది.

ఇంకొకడు దయాదాక్ష్యిణ్యాలు లేకుండా కాల్పులు ప్రారంభించాడు. 11 అక్టోబ‌ర్‌ 1938 న బాజీ నేల‌కొరిగాడు. కేవ‌లం 12 ఏళ్ల‌కే దేశం కోసం బ్రిటీష్ తూటాల‌ను లెక్క‌చేయ‌కుండా ఎదురెళ్లిన భార‌త మాత ముద్దు బిడ్డ‌. నిర్జీవంగా నేలకూలిన బాజీ రావత్‌తో పాటు తన స్నేహితులు లక్ష్మణ్‌ మాలిక్‌, ఫాగు సాహు, హృషి ప్రధాన్‌, నట మాలిక్‌లను కూడా బ్రిటిష్‌ పటాలం పొట్టన పెట్టుకుంది. కానీ, వారు గ్రామంలోకి మాత్రం ప్రవేశించలేకపోయారు. ఆ విధంగా వందలాదిమంది ప్రాణాలు కాపాడి, భారత అతిపిన్న స్వాతంత్య్ర సమరయోధుడిగా బాజీ రావత్‌ అమరుడయ్యాడు.

ఇలా ఎంద‌రో భార‌త మాత విముక్తి కోసం పోరాడి నెల‌కొరిగిన అమ‌ర వీరుల‌ను స్మ‌రిస్తూ మ‌న‌లోకం అందిస్తున్న క‌థ‌నాలు మ‌రింత మందికి చేరువ చేస్తార‌ని ఆశిస్తున్నాం. చ‌రిత్ర మ‌ర‌చిన యోధుడు.. 18 ఏళ్లకే ఉరి కంబమెక్కిన‌ విప్లవ వీరుడు కుదిరామ్ బోస్

 

Read more RELATED
Recommended to you

Latest news