శ్రీకృష్ణుడి అష్టమహిషులు వీరే !!

-

శ్రీకృష్ణావతారం అంటే అందరూ పదహారువేలమంది భార్యలు అనుకుంటారు. నిజానికి ఆయన వివాహం చేసుకుంది ఎనిమిది మందిని అని పురాణాలలో ఉంది. వారి గురించి తెలుసుకుందాం..

శ్రీకృష్ణుడు ఎనిమిదిమంది భార్యలను వివాహమాడాడు. రుక్మిణి కృష్ణుడిని ప్రేమించింది. ఆమెను శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలని తలుస్తాడు ఆమె సోదరుడు రుక్మి. బలవంతపు పెళ్లి ఇష్టంలేని రుక్మిణి రహస్య సందేశం పంపడంతో కృష్ణుడు ఆమెను ఎత్తుకుపోయి రాక్షసవివాహం చేసుకుంటాడు. అడ్డు వచ్చిన రుక్మికి సగం శిరస్సు, సగం మీసాలు గొరిగి బుద్ధిచెబుతాడు. సత్రాజిత్తు వద్దనున్న శమంతకమణి పోయి, అతడి సోదరుడు ప్రసేనుడు సింహం నోటపడి మరణించడంతో ఆ నింద కృష్ణునిపై పడుతుంది. శమంతకమణిని జాంబవంతుని గుహలో కనుగొన్న కృష్ణుడు అతడిని యుద్ధంలో గెలవడంతో జాంబవంతుడు శమంతకమణితో పాటు తన కూతురు జాంబవతిని కృష్ణుడికి సమర్పిస్తాడు.

శమంతకమణిని తిరిగి తెచ్చివ్వడంతో సత్రాజిత్తు తన కూతురు సత్యభామతో కృష్ణుడికి వివాహం జరిపిస్తాడు. వసుదేవుడి చెల్లెలైన శ్రుతకీర్తి కూతురు భద్రను, మరో మేనత్త కూతురు అవంతీ రాజపుత్రిక మిత్రవిందను స్వయంవరంలో పెళ్లాడతాడు. కోసలరాజు నగ్నజిత్తు వద్ద ఏనుగులంత బలం ఉండే ఏడు వృషభాలు ఉండేవి. వాటిని నిగ్రహించిన వానికి కూతురునిస్తానని ప్రకటించడంతో, కృష్ణుడు ఏడు రూపాల్లో ఏడు వృషభాలనూ నిగ్రహించి, నగ్నజిత్తు కూతురు నాగ్నజితిని వివాహమాడతాడు. మద్ర దేశాధిపతి కూతురు లక్షణ స్వయంవరంలో కృష్ణుడిని వరిస్తుంది. ఈ ఎనిమిదిమంది ద్వారా కృష్ణుడికి పదేసిమంది చొప్పున కొడుకులు కలిగారు.

– శ్రీ

 

Read more RELATED
Recommended to you

Latest news