‘ జ్ఞాన ప్రపంచంలోకి, సృజనలోకి, మానవ సంబంధాల్లోకి ప్రవేశించే కృషిలో ఉన్న సజీవ ప్రాణి విద్యార్థి ‘ అని అంటాడు ఓ మహానుభావుడు. ఆ సజీవ ప్రాణికి తన హృదయాన్ని అర్పిస్తూ.. మానవ ఆదర్శాన్ని నేర్పిస్తూ.. వ్యక్తిగా, పౌరుడిగా తీర్చిదిద్ది ఉజ్వల భవిష్యత్‌ను అందిస్తున్న గురువులకు వందనం.. పిల్లల ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఎక్కివెళ్లి.. వారి అనుభూతులతో బాంధవ్యం ఏర్పరచుకుని తమ కుటుంబాలని, శ్రమని, మాతృదేశాన్నీ ప్రేమించేటట్టు చేస్తున్న ఉపాధ్యాయులకు పాదాభివందనం.
విద్యార్థుల హృదయాంతరాళ్లల్లోకి ప్రవేశించి.. మానవత్వాన్నీ పాదుకొల్పుతున్న గురువులను పూజించుకునే రోజు సెప్టెంబర్ 5వ రానే వచ్చింది. ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన భారత రెండో రాష్ట్రపతి సర్వేపల్లి జయంతినే ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. భారతదేశంలో గురువుకు దక్కే మర్యాద మరెవ్వరికీ లేదన్నది స్పష్టమే. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ.. అని అన్నారు. తల్లిదండ్రుల తర్వాత నిలిచే వ్యక్తి గురువే. పిల్లవాడికి తల్లిదండ్రులు జన్మనిస్తే.. ఆ పిల్లవాడి వేలుపట్టుకుని జ్ఞానప్రపంచంలోకి నడిపిస్తాడు గురువు. అందుకే అంటారు.. ఈ సమాజానికి ఉపాధ్యాయులే మార్గనిర్దేశకులని.
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం. పిల్లల నడవడిక గురువు మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే ఉపాధ్యాయుడిలోనే పిల్లలు మానవధర్మాన్ని చూస్తూ నేర్చుకుంటారని అంటారు పెద్దలు. అందుకే ఈ సమాజ వ్యక్తిత్వం గురువు చేతిలోనే రూపదాల్చుతుందని చెప్పొచ్చు. ఉపాధ్యాయులు నేర్చించే నైతిక విలువలు.. పిల్లలను సమాజంలో ఉత్తమ పౌరులుగా నిలబెడుతాయి. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి, రాష్ట్రపతిగా ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సెప్టెంబర్ 5వ తేదీనే ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సమాజంలో ఉపాధ్యాయ వృత్తిని ఎంతో పవిత్రమైనదిగా ప్రజలు భావిస్తారు.
జీవితంలో ఎంతటి వారైనా.. తమ గురువు కనిపించగానే చేతులెత్తి నమస్కరించి తమ సంస్కారం చాటుకుంటారు. అంతటి పవిత్రతను సంతరించుకున్న ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న వారిని నేటికీ పూజిస్తున్నాం. పిల్లల బంగారు భవిష్యత్ కోసం తమ జీవితాలనే అంకితం చేస్తున్న ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతున్నాం. ఇక ఈ రోజు ప్రతీ పాఠశాలలో పండుగరోజే. పిల్లలందరూ ఎంతో ఆనందంగా తమ గురువులను పూలమాలలు, శాలువాలతో సన్మానించి, పాదాభివందనం చేస్తారు.