తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా.. అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్ 2వ తేదీ నుంచి 22 రోజుల పాటు ఈ వేడుకలకు ఘనంగా జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఈ వేడుకలు జూన్ 2న హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమవుతాయి.
దశాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవం షెడ్యూల్ ఇదే..
- జూన్2వ తేదీ శుక్రవారం ఉదయం గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి సీఎం నివాళులర్పిస్తారు.
- 10.30 గంటలకు సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరిస్తారు.
- అనంతరం రాష్ట్ర పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు.
- అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో దశాబ్ది ఉత్సవ సందేశమిస్తారు.
ఇదే సమయంలో జిల్లాల్లోనూ మంత్రుల ఆధ్వర్యంలో పతాక వందనం, దశాబ్ది ఉత్సవ సందేశ కార్యక్రమాలు జరుగుతాయి. సచివాలయంలో నిర్వహించనున్న కార్యక్రమాల్లో అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగాధిపతులు, సిబ్బంది హాజరుకావాలని సీఎస్ శాంతికుమారి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని శాఖల విభాగాధిపతులకు సీఎస్ కార్యాలయం నుంచి ఆహ్వాన పత్రికలు పంపారు. అధికారులు, సిబ్బంది సచివాలయంలోకి ప్రవేశించడానికి వీలుగా నమూనా కార్డులను కూడా వాటికి జత చేశారు.