ఏనుగులను ఒక చిన్న తాడుతో బంధించిఉంచడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. అసలు వాటికి ఆ తాడు లెక్కే కాదు. అయినా ఆ ఏనుగులు తప్పించుకునే ప్రయత్నం చేయడం లేదు.
ఓ పెద్దమనిషి ఏనుగుల సంరక్షణ కేంద్రం పక్కనుండి నడుచుకుంటూ వెళుతున్నాడు. యధాలాపంగా అటువైపు చూసిన ఆయన ఆశ్చర్యపోయాడు. అక్కడ ఉన్న ఏనుగులు బోనుల్లోనో, గొలుసులతో బంధించబడి లేవు.
ఉన్నదల్లా ఒక చిన్న తాడు వాటి కాలుకు కట్టబడిఉంది. ఆ పెద్దమనిషి అయోమయంగా చూసాడు. అవి ఎందుకలా ఉన్నాయి? తప్పించుకోవచ్చు కదా! ఆ చిన్న తాడు వాటి బలం ముందు బలాదూర్. ఎంచక్కా దాన్ని తెంపుకుని సమీపంలోని అడవిలోకి వెళ్లిపోయి స్వతంత్రంగా జీవించవచ్చు కదా.. అన్నది ఆయన సందేహం.
ఇక తట్టుకోలేక, సమీపంలోనే ఉన్న వాటి మావటిని పిలిచి, తన సందేహం వెలిబుచ్చాడు.
అప్పుడు ఆ మావటి చెప్పిన సమాధానం..
’’ అవి పిల్లలుగా, చిన్న సైజులో ఉన్నప్పుడు ఇదే చిన్న తాడు వాడేవాళ్లం. అప్పటికి వాటిని పట్టి ఉంచడానికి అది సరిపోయేది. అప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేసినా, తాడును తెంచలేకపోయేవి. వాటి వయస్సు, పరిమాణం పెరిగినా, తాడుకు సంబంధించి వాటి నమ్మకం మాత్రం అలాగే మిగిలిపోయింది. దాన్ని తాము తెంచలేమన్న భావనలోనే అవి ఇంకా ఉన్నాయి. అందుకే అవి తప్పించుకునే ప్రయత్నం చేయవు.’’
ఏళ్ల తరబడి, ‘నేను తెంచలేను’ అనే నమ్మకం బలపడిపోయి, అవి అసలు ప్రయత్నమే మానేసాయి.
ఇందులో నీతి ఏంటంటే… ఈ ప్రపంచం మిమ్మల్ని ఎంత వెనక్కి లాగాలని ప్రయత్నించినా, మీరు లక్ష్యాన్ని చేరుకోవడం సంభవమే అని నమ్మండి. సాధించగలమని నమ్మడమే, సాధించడం కన్నా ముఖ్యం.