నీతి కథలు : గోడ మీద మేకులు

-

ఆ అబ్బాయి రోజూ గోడకు మేకులు కొట్టాల్సివస్తోంది. మెల్లమెల్లగా తన దగ్గర ఉన్న మేకులన్నీ అయిపోయాయి. వెళ్లి వాళ్ల నాన్నతో చెప్పాడు ‘‘నాన్నా… సక్సెస్‌.. మేకులు కొట్టడం ఆగిపోయింది.’’

ఒక ఊళ్లో చైతన్య అనే పన్నెండేళ్ల పిల్లవాడు ఉండేవాడు. వాళ్ల నాన్న రామారావు అదే ఊళ్లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఈ చైతన్యకి విపరీతమైన కోపం. అయిందానికి కానిదానికి వెంటనే కోపం వచ్చేది. దాని వల్ల చాలా కష్టాలు పడుతున్నాడు. స్కూల్లో టీచర్లు కూడా చైతన్యతో జాగ్రత్తగా మాట్లాడేవారు. ఇక ఫ్రెండ్స్‌ అయితే దాదాపుగా వెలేసారు. ఇవన్నీ చైతన్య నాన్నగారికి తెలుసు.

Moral stories Nails on the wall
Moral stories Nails on the wall

ఒకరోజు తండ్రి, చైతన్యను పిలిచి మాట్లాడాడు. ‘నీకెందుకు అలా కోపమొస్తోంది? తప్పు కదా..!’ అని అన్నాడు. దానికి ఆ అబ్బాయి, ‘నిజమే నాన్నా.. ఎంత కంట్రోల్‌ చేసుకుందామనుకున్నా, కుదరడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరూ నాతో మాట్లాడటంలేదు’ అని ఆవేదనతో చెప్పాడు. దానికి వాళ్ల నాన్న ఒక్క నిముషమంటూ ఇంట్లోకి వెళ్లాడు. కాసేపటికి బయటికి వచ్చి, ఒక సుత్తి, ఒక సంచీ చైతన్యకు ఇచ్చాడు. ఆ సంచీలో చూస్తే కొన్ని మేకులున్నాయి. ప్రశ్నార్థకంగా చూస్తున్న చైతన్యతో, ‘నీకు కోపం బాగా వస్తుంది కదా. అలా కోపం వచ్చినప్పుడల్లా ఓ మేకు ఆ ప్రహరీ గోడకు కొట్టు’ అని చెప్పాడు.

అలా, మొదటిరోజు నాడు 37 మేకులు కొట్టాల్సివచ్చింది. చైతన్య రోజూ మేకులు కొడుతూనేఉన్నాడు. మెల్లమెల్లగా రోజూ కొట్టే మేకుల సంఖ్య తగ్గింది. మేకులు కొట్టడం కంటే కోపం తగ్గించుకోవడమే సులభమని చైతన్యకి అర్థమయింది. కొన్ని రోజులకు మేకులు కొట్టడం ఆగిపోయింది. సంచీలో ఇంకా కొన్ని మేకులు మిగిలే ఉన్నాయి. కానీ, చైతన్యకు ఇప్పుడు కోపం  రావడం లేదు. ఆ రోజు వాళ్ల నాన్న వద్దకు వెళ్లి, ‘‘నాన్నా ! ఇప్పుడు నాకు కోపం రావడం లేదు. మేకులు కొట్టడం కూడా ఆగిపోయింది’’ అన్నాడు. ’’అవునా..! వెరీ గుడ్‌.. అయితే ఇలా..రా..’’ అని చైతన్యకు మేకులు కొట్టిన గోడ వద్దకు తీసుకెళ్లాడు. ‘‘ఇప్పుడు…  నీకు కోపం రాని రోజున ఒక్కొక్కటి చొప్పున మేకులు తీసేయ్‌’’అన్నాడు.

ఆ రోజు నుండి రోజుకొకటి చొప్పున రాత్రి పడుకునేముందు మేకులు తీయసాగాడు. కొంతకాలానికి గోడ మీది మేకులన్నీ అయిపోయాయి. చైతన్య కోపం కూడా మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు చైతన్య బాగా బిజీ. స్కూల్లో బాగా చదువుతున్నాడు. మాస్టార్లు మెచ్చుకుంటున్నారు. స్నేహితులు బాగా పెరిగారు. చాలా ఆనందంగా ఉన్నాడు చైతన్య. అదే విషయం చెప్పాడు వాళ్ల నాన్నతో. రామారావు గారు చైతన్యను తీసుకుని ప్రహరీగోడ దగ్గరికి వెళ్లారు.

‘‘చూడు నాన్నా..! నీకు కోపం పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు నువ్వు ఎవరినీ ఏమీ అనడం లేదు. గోడ మీడి మేకులన్నీ అయిపోయాయి. కానీ…. రంధ్రాలు మాత్రం మిగిలిపోయాయి.. చూసావా?’’ అన్నాడు. చైతన్య తలదించుకున్నాడు. ‘‘నీ కోపం వల్ల మాటలు పడ్డవారు ఎంతో బాధపడిఉంటారు. నువ్వు ఎన్నిసార్లు సారీ చెప్పినా వారి బాధ తీరదు. గాయం మానినా, మచ్చ మానదు… ఇలాగే..’’అంటూ ముగించాడు.

నిజమే.. వదిలిన మాట, బాణం వెనక్కి తిరిగి రావు.. మన మాటలే మనకు మిత్రులను, శత్రువులను తయారుచేప్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news