ఢిల్లీలోని సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ క్యాంపు కరోనా వైరస్‌కు కేంద్ర బిందువుగా మారింది. కేవలం రెండు వారాల్లోనే ఆ క్యాంపుకు చెందిన 122 మంది జవాన్లకు కరోనా సోకింది. ఇంకా 100 మంది ఫలితాలు రావల్సి ఉంది. దీంతో కేంద్ర హోం శాఖ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. క్యాంపుకు చెందిన సీఆర్‌పీఎఫ్ చీఫ్‌ను ఈ విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. వైరస్ ఇంత వేగంగా ఎలా వ్యాప్తి చెందుతోంది, కరోనా రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. తదితర విషయాలపై నివేదిక ఇవ్వాలని చీఫ్‌ను అడిగింది.
తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్-3లో ఉన్న పారామిలటరీ ఫోర్స్‌కు చెందిన 31వ బెటాలియన్ జవాన్లకు 2 వారాల్లోనే కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. ఈ బెటాలియన్‌కు చెందిన 55 ఏళ్ల జవాను ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. ఒక్క శుక్రవారం రోజే 12 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. 2 రోజుల కిందట 45 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక కరోనా సోకిన జవాన్లకు ఢిల్లీలోని మండావలి సెంటర్‌లో చికిత్స అందిస్తున్నారు.
కాగా గత నెల 17న సీఆర్‌పీఎఫ్ పారామెడిక్ యూనిట్‌కు చెందిన ఓ నర్సింగ్ అసిస్టెంట్ ఈ బెటాలియన్‌లో చేరగా అతనికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఏప్రిల్ 21న టెస్టులు చేశారు. దీంతో అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలో ఆ వ్యక్తిని ఢిల్లీలోని రాజీవ్ గాంధీ హాస్పిటల్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇక అతనితోనే క్యాంపులో ఉన్న అందరికీ కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు.