కరోనా టెస్టులకు ప్రభుత్వాలు ప్రస్తుతం ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నాయో అందరికీ తెలిసిందే. ఒక టెస్టుకు కనీసం రూ.4,500 వరకు ఖర్చవుతోంది. ఇక ఫలితం కూడా వెంటనే రావడం లేదు. 24 గంటల వరకు ఆగాల్సి వస్తోంది. అయితే ఇకపై అంత ఖర్చు పెట్టాల్సిన పనిలేకుండా.. చాలా తక్కువ వ్యవధిలోనే కరోనా టెస్టు ఫలితం వచ్చేలా.. ఆ కంపెనీ ఓ నూతన పరికరాన్ని తయారు చేసింది.
పశ్చిమ బెంగాల్‌లోని జీసీసీ బయోటెక్ ఇండియా కంపెనీ కరోనా టెస్టులను తక్కువ ఖర్చుతోనే చేసేలా.. టెస్టుల ఫలితాలు వేగంగా వచ్చేలా ఓ నూతన పరికరాన్ని తయారు చేసింది. దీంతో రూ.500కే కరోనా టెస్టు చేయవచ్చు. అలాగే 90 నిమిషాల్లోనే టెస్టు ఫలితం వస్తుంది. దీంతో ఒకేసారి పెద్ద ఎత్తున కరోనా టెస్టులు చేసేందుకు వీలు కలుగుతంది.
జీసీసీ బయోటెక్ కంపెనీ తయారు చేసిన ఆ పరికరాన్ని రియల్ టైం కరోనా టెస్టింగ్ కిట్ అని పిలుస్తున్నారు. దీంతో ఒక వ్యక్తికి 90 నిమిషాల్లోనే కరోనా ఉందీ, లేనిదీ తెలిసిపోతుంది. అలాగే టెస్టుకు కేవలం రూ.500 మాత్రమే ఖర్చవుతుంది. ఈ సందర్భంగా ఆ కంపెనీ ఎండీ ఆర్ మజుందార్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ టెస్టు కిట్లు 1 కోటి వరకు తయారు చేశామని తెలిపారు. దీంతో ఎంతో డబ్బు, సమయం ఆదా అవుతాయని తెలిపారు. అలాగే కరోనా వ్యాప్తిని కూడా నియంత్రించవచ్చని అన్నారు.