భారత్‌లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 39,980 మందికి ఈ వైరస్ సోకగా, 10,633 మంది రికవరీ అయ్యారు. 1301 మంది చనిపోయారు. కాగా దేశంలో ఇప్పటి వరకు మొత్తం 10 లక్షల మందికి కరోనా టెస్టులు చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న 419 ల్యాబ్‌లలో నిత్యం 75వేల మందికి కరోనా టెస్టులు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు.
మార్చి 25వ తేదీ నుంచి దేశంలో విధించిన లాక్‌డౌన్ సత్ఫలితాలను ఇస్తోంది. లాక్‌డౌన్ లేకపోతే లక్షల్లో కరోనా కేసులు నమోదయ్యేవని అధికారులు ఇప్పటికే తేల్చి చెప్పారు. ఇక ఈ లాక్‌డౌన్ సమయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సద్వినియోగం చేసుకున్నాయి. ఈ సమయంలో దేశంలోని ప్రముఖ హెల్త్ ఇనిస్టిట్యూట్లయిన ఎయిమ్స్, చండీగఢ్ పీజీఐ, వెల్లూర్ సీఎంసీ, పుదుచ్చేరి జిప్‌మర్, లక్నో ఎస్‌జీపీఐఎంఎస్, భువనేశ్వర్ ఎయిమ్స్‌లు మెడకల్ కాలేజీలు, ల్యాబ్‌లు, హాస్పిటళ్లలో వైద్య సిబ్బందికి కరోనాపై శిక్షణ ఇచ్చాయి. టెస్టింగ్ మొదలుకొని ట్రీట్‌మెంట్ వరకు పేషెంట్ల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. దీంతో నిత్యం 75వేల మందికి కరోనా టెస్టులు చేయగలుగుతున్నారు.
కాగా దేశంలోని ప్రతిపక్ష పార్టీలు.. కరోనా టెస్టులను ఎక్కువ సంఖ్యలో, వేగంగా చేయాలని.. ఆ వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ వివరాలను వెల్లడించడం విశేషం.