కనిపించని మహమ్మారిగా మారి.. ప్రపంచాన్ని భీకరంగా హడలెత్తిస్తున్న కరోనాను కట్టడి చేయడంలో అగ్రరాజ్యాలే విఫలమ య్యాయి. మాకన్నా ఎవరు ఎక్కువ? అని ప్రశ్నించిన అమెరికా అధినేత ట్రంప్ సహా ఎందరో తలకిందులవుతున్నారు. అలాంటి ది పెద్దగా వైద్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని భారత్ పరిస్థితి ఏంటి? అమెరికాలోనే కరోనాను కట్టడి చేయలేక.. అక్కడి అధ్యక్షుడు.. నా చేతుల్లో ఏమీ లేదు. చేయాల్సింది చేస్తున్నా.. అంతా మీ చేతుల్లేనని ప్రకటించేశారంటే.. కరోనా ఏస్థాయిలో అమెరికాను కబళించిందో అర్ధమవుతోంది. వైద్యులను సైతం ఈ మహమ్మారి విడిచి పెట్టడం లేదు.
అలాంటి కరోనా మన దేశంలోనూ చాపకింద నీరులా విజృంభిస్తోందనే విషయం తెలుసా ? కేంద్ర ప్రభుత్వం ప్రజలతో చప్పట్లు కొట్టించి, దీపాలు పెట్టించి ఏదో హంగా మా చేసినా.. కేసుల తీవ్రత విషయంలో కేంద్రం చేస్తున్న దానికీ, కరోనా విజృంభిస్తున్న వైనానికీ మధ్య ఎలాంటి సంబంధమూ కనిపించడం లేదు. నిజానికి మార్చి14తో ఏప్రిల్ 14ను పోలిస్తే.. ఎన్ని రోజులు? కేవలం 30 రోజులు. అయితే, ఈ 30 రోజుల్లో దేశంలో కరోనా ఎలా విజృంభించిందో తెలిస్తే.. ఒక్కసారిగా విస్మయానికి గురి కావడం గమనార్హం.
అప్పట్లో అంటే మార్చి 14 నాటికి (ఇంకా లాక్డౌన్ విధించలేదు) దేశంలో కరోనా కేసులు 100. అయితే, ఏప్రిల్ పద్నాలుగు నాటికి (అంటే దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ.. ప్రధాని మోడీ ప్రసంగం చేసే సమయానికి) దేశంలో కేసులు అక్షరాలా 10,815. అంటే కేవలం 30 రోజుల వ్యవధిలో కేసుల తీవ్రత దారుణంగా ఉందనే విషయాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి లాక్డౌన్ విధించి కూడా మూడు వారాలు పూర్తయ్యాయి. అయినా కూడా ఈ కేసులు ఇలా పెరగడానికి కారణం ఏంటి? ఎందుకు ? అనేది తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. గతంలో అయితే, మర్కజ్‌కు వెళ్లి వచ్చారు కాబట్టి కేసులు పెరిగాయని చెప్పుకొన్నా.. ఆ తీవ్రత నుంచి ఇప్పుడు మూడోదశకు దేశం చేరుకుంది.
ఇప్పటికి రెండు వందలకుపైగానే జనాలు మృత్యువాత పడ్డారు. దీనిని ప్రజలు తీవ్రంగానే భావించాలి. ఈ పరిస్థితి ముందు ముందు మరింత తీవ్రమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తోంది. కాబట్టి.. మోడీ చెప్పాడనో.. మరెవరో అన్నారనో కాకుండా ఎవరికివారు కరోనాను జయించేందుకు వారి వద్ద ఉన్న ఏకైక అస్త్రం ఇంటికే పరిమితం కావడం, కనీసం జాగ్రత్తలు తీసుకోవడం. దీనిని నిర్లక్ష్యం చేస్తే.. నష్టపోయేది మనమే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ భావించాలి. అప్పుడే కరోనా భూతానికి కోరలు విరిగేది.. దేశంలో మళ్లీ జనజీవనం వెల్లివిరిసేది..!!