గుడ్ న్యూస్‌.. త్వ‌ర‌లో ప్రైవేటు ల్యాబ్‌ల‌లోనూ క‌రోనా టెస్టులు చేయించుకోవ‌చ్చు..!

-

క‌రోనా వైర‌స్ అనుమానితులకు ప‌రీక్ష‌లు జ‌రిపేందుకు దేశ‌వ్యాప్తంగా మొన్న‌టి వ‌ర‌కు 52 ప‌రీక్షా కేంద్రాలు అందుబాటులో ఉండ‌గా ఇప్పుడా సంఖ్య 72కు చేరుకుంది. దీంతో మొత్తం 72 ప‌రీక్షా కేంద్రాల్లో ప్ర‌స్తుతం కరోనా అనుమానితుల‌కు ప‌రీక్ష‌లు చేస్తున్నారు. అయితే స‌ద‌రు ప‌రీక్షా కేంద్రాల‌న్నీ ఆయా రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌భుత్వాలు ఏర్పాటు చేసిన‌వి కాగా, ఇంకా ప్రైవేటు ల్యాబ్‌ల‌లో క‌రోనా టెస్టులు చేయ‌డం లేదు. కానీ త్వ‌ర‌లోనే ప్రైవేటు డ‌యాగ్న‌స్టిక్స్ సెంట‌ర్ల‌కు కూడా క‌రోనా టెస్టులు చేసేందుకు అనుమ‌తినిస్తార‌ని తెలుస్తోంది. ఈ మేర‌కు ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌) ఉన్న‌త స్థాయి అధికారి ఒక‌రు మీడియాకు తెలిపారు.

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ మ‌న దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో ఇంకా ఎక్కువ ప‌రీక్షా కేంద్రాల అవ‌స‌రం ఉంది క‌నుక ప్రైవేటు ల్యాబ్‌ల‌కు కూడా క‌రోనా టెస్టులు చేసేందుకు అనుమ‌తి ఇచ్చే అంశం ప‌రిశీల‌న‌లో ఉంద‌ని ఐసీఎంఆర్ అధికారి ఒక‌రు తెలిపారు. అయితే కొన్ని ల్యాబ్‌లు ఉచితంగానే టెస్టులు చేసేందుకు ముందుకు వ‌చ్చాయ‌ని అన్నారు. కాగా కరోనా ప‌రీక్ష‌ల‌లో భాగంగా చేసే మొద‌టి టెస్టుకు రూ.1500 ఖ‌ర్చ‌వుతుంది. అనంత‌రం చేసే ప్ర‌తి టెస్టుకు రూ.3వేల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంది. ఈ క్ర‌మంలో ప్రైవేటు ల్యాబ్‌లు క‌రోనా టెస్టులు చేస్తే ఆ మొత్తాన్ని వారే భ‌రించాల్సి వ‌స్తుంది.

ఇక దేశంలో నేష‌న‌ల్ అక్రిడిటేష‌న్ బోర్డ్ ఫ‌ర్ హాస్పిట‌ల్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొవైడ‌ర్స్ (ఎన్ఏబీహెచ్‌) గుర్తింపు ఉన్న ల్యాబ్‌ల‌కే క‌రోనా టెస్టులు చేసేందుకు అనుమ‌తినిస్తామ‌ని ఐసీఎంఆర్ అధికారులు తెలిపారు. ఈ క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా ఆ గుర్తింపు ఉన్న ప్రైవేటు ల్యాబ్‌లు 60 వ‌ర‌కు ఉన్నాయి. అయితే వాటిల్లో ఎప్ప‌టి నుంచి కరోనా టెస్టులు చేస్తార‌నే విష‌యంపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. ఇక ప్రైవేటు ల్యాబ్‌ల‌లో క‌రోనా టెస్టులు చేస్తే పాజిటివ్ వ‌చ్చిన పేషెంట్ల వివ‌రాల‌ను స్థానిక ప్ర‌భుత్వాల‌కు ఆయా ల్యాబ్‌లు ఇవ్వాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version