బాధను కోపంగా మార్చుకుంటున్న ఎంపీ…. ఎవరికి నష్టం?

-

వైకాపాలో అసంతృప్తి పెరుగుతుంది అన్న అనంతరం ఏమి జరిగిందో తెలియదు కాని… బొళ్ల బ్రహ్మనాయుడు, ధర్మాన ప్రసాద రావు మొదలైన నేతలు సైలంట్ అయ్యారు! అధినేతను అర్ధం చేసుకున్నారా లేక సర్ధుకున్నారా అన్నది వేరేసంగతి! ఈ క్రమంలో వారితో పాటు ఇసుక వేదికగా లేచిన అసంతృప్త స్వరం… నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజుది!

అవును… మొన్న ఇసుక పేరు చెప్పి జగన్ ను పొగుడుతూనే తనదైన గోదావరి జిల్లా వెటకారంతో చెప్పాల్సిన విషయం చెప్పే ప్రయత్నం చేశారు ఈ వైకాపా ఎంపీ! సరే… అదేదో అలా జరిగింది… అది పెద్ద విషయం కాదు… ఏదో ఎమోషన్ లో బరస్ట్ అయ్యరు అనుకున్నారు అంతా! కానీ… ఇంతలోనే మరో బాంబు పేల్చారు!

అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడంపై వైకాపా నేతలంతా హర్షం వ్యక్తం చేస్తున్నంత పనిచేస్తుంటే… అలా అరెస్టు చేయడం మానవ హక్కుల ఉల్లంఘనే అన్నస్థాయిలో రఘురామ కృష్ణం రాజు మాట్లాడారు! ఆయన ఇసుక విషయంలో అధికారులను అన్నా.. అచ్చెన్న అరెస్టు విషయంలో ఏసీబీ ని అన్నా… తగిలేది జగన్ కే అన్న కామెంట్ల సంగతి కాసేపు పక్కనపెడితే… ఆయన ధిక్కార స్వరం కాస్త పెంచారన్న క్లారిటీ మాత్రం చాలా మందికి వస్తుంది!

అయితే వీటన్నింటికీ వివరణ ఇస్తున్నట్లుగా మాట్లాడుతూనే… సిగ్గు విడిచి చెబుతున్నా, నాకు మా నాయకుడిని కలిసే అవకాశం రావడం లేదు అంటూ మరో బాంబు పేల్చారు! అది కచ్చితంగా పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి.. దాన్ని బహిరంగంగా మీడియాకు ఎక్కి చెప్పుకోవడం రఘురామ కృష్ణం రాజు తెలివికి నిదర్శనం అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యమంత్రి చుట్టు ఉన్న కోటరీ తన లాంటి వారిని సీఎం దగ్గరకు రానివ్వడం లేదని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు చెబుతున్నారు. ఇద్దరు ముగ్గురు ఎంపీలను తప్ప మిగతా వారిని సీఎం కూడా కలవడం లేదని చెబుతూ… సీఎం అంటే తనకు అత్యంత గౌరవం అని తెలిపారు. సీఎం ను కలవనివ్వకుండా కొందరు అడ్డు పడుతున్నారంటున్నారు.

టీటీడీ విషయంలో భక్తుడిగానే తాను స్పందించానని… ఇసుక కొరత తీవ్రంగా ఉందని, 16వేలకు ధర పెరిగిందన్న విషయం మాత్రమే చెప్పానని… రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో కోర్టు తీర్పులే తాను ఉదహరించానని రఘురామ కృష్ణంరాజు… తాను గతంలో అన్న మాటలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు!

తనది సీఎంపై కోపం కాదని, బాధ మాత్రమే అని చెప్పడానికి రఘురామకృష్ణం రాజు ప్రయత్నించారని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. అది కోపమైతే ఆ సంగతి, దాని వెనకున్న ఆయన ఆలోచన వేరుకావచ్చు కానీ… నిజంగా అది బాధ అయితే మాత్రం.. దాన్ని వ్యక్తపరిచే విధానం అది కాదేమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు! దానివల్ల నష్టం ఎవరికన్నది విజ్ఞులైన ఎంపీగారే ఆలోచించుకోవాలని మరికొందరు సూచిస్తున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news