ఫిబ్రవరి 14.. దేశం 40 మంది వీర జవాన్లను కోల్పోయిన రోజు

-

ఫిబ్రవరి 14. ఈ రోజు ప్రత్యేకత ఏందంటే ప్రపంచంలో ఎవరైనా టక్కున చెప్పే సమాధానం ‘వాలెంటైన్స్‌ డే’ అని, లేదా ప్రేమికుల రోజు’ అని. కానీ సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు యావత్‌ భారతదేశం దిగ్భ్రాంతికి లోనైంది. పాకిస్థాన్‌ పెంచిపోషిస్తున్న జైష్ ఎ మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌ లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి ఒడిగట్టింది. 40 మంది వీర జవాన్లను పొట్టనపెట్టుకుంది. ఈ దారుణ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఈ ఆత్మాహుతి దాడి జరిగిన తీరును చూస్తే.. ప్రతి ఒక్క భారతీయుడి రక్తం సలసల మసలుతుంది. ఈ ఘటన జరిగి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా మరొక్కసారి ఆ విషాధ ఘడియలను గుర్తుచేసుకుని, వీర జవాన్లను స్మరించుకుందాం. ఫిబ్రవరి 14 మధ్యాహ్నం సరిగ్గా 3 గంటల సమయంలో జమ్ముకశ్మీర్‌ రాష్ట్రంలోని పుల్వామా జిల్లా మీదుగా 78 బస్సుల్లో, 25,000 మంది జవాన్లతో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌ వెళ్తున్నది. అప్పటికే కారునిండా బాంబులతో రోడ్డు పక్కనే పొంచి ఉన్న జౌష్‌ ఎ మహమ్మద్‌ ఉగ్రవాది.. రెప్పపాటు సమయంలో కాన్వాయ్‌ని ఢీకొట్టాడు. అంతే! ఒక్కసారిగా నిశ్శబ్దం బద్దలైంది. సైనికుల హాహాకారాలతో ఆ ప్రాంతం మార్మోగింది. షాక్‌ నుంచి తేరుకునే లోపు 40 మంది సైనికులు విగత జీవులై పడిఉన్నారు.

ఈ మారణహోమం దేశ ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేసింది. దేశవ్యాప్తంగా జనం రోడ్లపైకి వచ్చి పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిన పాకిస్థాన్‌కు తగిన బుద్ధిచెప్పాల్సిందేనని నినదించారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులందరూ ముక్త కంఠంతో ఈ దాడిని ఖండించారు. కేంద్ర సర్కారు వీర జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించి, అంతిమ సంస్కారాలు పూర్తిచేసింది.

అయితే, ఈ ఘాతుకం జరిగి ఏడాది పూర్తయింది కదా! ఈ ఏడాది కాలంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? ఈ దాడికి పాల్పడిన వారిపట్ల భారతదేశం ఎలా స్పందించింది? అనే అంశాలను పరిశీలిద్దాం! ఆత్మాహుతి దాడి జరిగిన రెండు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 16న కేంద్ర ప్రభుత్వం.. ప్రతీకార దాడి కోసం రగిలిపోతున్న దేశ సైనికులకు ఒక శుభవార్త తెలియజేసింది. ‘శత్రువుపై ఎప్పుడు, ఎక్కడ, ఏ రకంగా ప్రతీకారం తీర్చుకుంటారో మీ ఇష్టం. ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం. ప్రభుత్వం ఏమాత్రం అడ్డు చెప్పబోదు’ అని ప్రకటించింది.

ఆ మరుసటి రోజే.. అంటే ఫిబ్రవరి 17న ప్రధాని నరేంద్రమోదీ కూడా పుల్వామా ఉగ్రవాద దాడిని ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేశారు. దేశంలో ఆందోళనలు నిర్వహిస్తున్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ‘మీ హృదయాల్లో ఎలాంటి ప్రతీకార జ్వాల అయితే రగులుతున్నదో, నా గుండెల్లో కూడా అలాంటి ఆగ్రహ జ్వాలే రగులుతున్నది’ అన్నారు.

ఐక్యారాజ్యసమితితో సహా ప్రపంచంలోని పలు దేశాలు సైతం పుల్వామా ఆత్మాహుతి దాడిని తీవ్రంగా ఖండించాయి. భారత దేశం ఉగ్రవాదంపై చేసే ఎలాంటి పోరాటానికైనా తమ మద్దతు ఉంటుందని పలు దేశాలు ప్రకటించాయి. ఇంతటి క్రూరమైన పిరికిపందల చర్యను తీవ్రంగా ఖండస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఒక తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి యూఎన్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌లోని శాశ్వత, తాత్కాలిక సభ్యదేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. పాకిస్థాన్‌కు ప్రాణమిత్రుడిగా ఉన్న చైనా సైతం ఈ తీర్మానానికి మద్దతు తెలిపింది.

హేయమైన ఉగ్రవాద దాడి నేపథ్యంలో.. జైష్‌ ఏ మహమ్మద్‌ చీఫ్ మసూద్ అజర్‌పై అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేయించేందుకు భారత్‌ తీవ్రంగా శ్రమించింది. ప్రపంచంలోని ప్రధాన దేశాలతో దౌత్యం నడిపి చివరికి 2019, మే 1న అనుకున్నది సాధించింది. మసూద్‌ అజర్‌పై అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేయాలంటూ ఐరాస భద్రతామండలిలో అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దేశాలు చేసిన ప్రతిపాదనకు చైనా మినహా అన్ని దేశాలు ఆమోదం తెలిపాయి.

మరోవైపు పుల్వామా దాడి జరిగిన 12 రోజులకు అంటే.. ఫిబ్రవరి 26న తెలతెలవారుతుండగానే పాకిస్థాన్‌లోని ఖైబర్‌ ఫక్తుంక్వా ప్రావిన్స్‌, బాలాకోట్‌ ప్రాంతంలోగల జైష్‌ ఎ మహమ్మద్‌ ఉగ్రవాద స్థావరంపై భారత వైమానిక దళానికి చెందిన జెట్‌ఫైటర్లు బాంబుల వర్షం కురిపించారు. ఈ దాడిలో పలువురు జైష్‌ ఎ మహమ్మద్‌ ఉగ్రవాదులు, శిక్షకులు, జిహాదీ గ్రూప్‌లు, సీనియర్‌ కమాండర్లు హతమయ్యారని అప్పటి విదేశాంగ శాఖ కార్యదర్శి మీడియాకు వెల్లడించారు. మసూద్‌ అజర్‌కు బావ అయిన మౌలానా యూసఫ్‌ అజర్‌ నేతృత్వంలో ఆ ఉగ్రవాద శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

అయితే మరుసటి రోజే పాకిస్తాన్‌ కూడా ప్రతీకార దాడికి పాల్పడింది. జమ్ముకశ్మీర్లోని భారత సైనిక స్థావరాలు లక్ష్యంగా పాకిస్తాన్‌ వైమానిక దళం జరిపిన ఈ దాడిని భారత వైమానిక దళం సమర్థంగా తిప్పికొట్టింది. ఈ సందర్భంగా భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ మిగ్‌-21 బైసన్‌ యుద్ధవిమానాన్ని నడుపుకుంటూ వెళ్లి.. పాకిస్తాన్‌కు వైమానిక దళానికి చెందిన అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్‌-16 ను కూల్చేవేశాడు. ఈ ఘటనలో మిగ్‌-21 కూడా ధ్వంసమవడంతో అభినందన్‌ ప్యారాచూట్‌ సాయంతో బయటపడ్డాడు. అయితే ఆ ప్యారాచూట్‌ పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్లో ల్యాండ్‌ కావడంతో పాక్‌ ఆర్మీకి పట్టుబడ్డాడు.

అయితే, భారత ప్రభుత్వం అన్ని దేశాలతో మాట్లాడి అభినందన్‌ విడుదల కోసం పాకిస్తాన్‌పై తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో రెండు రోజుల తర్వాత అంటే.. మార్చి 1న అభినందన్‌ వర్ధమాన్‌ను పాకిస్తాన్‌ విడిచిపెట్టింది. పాకిస్తాన్‌ నుంచి స్వదేశానికి చేరుకున్న అభినందన్‌కు దేశ ప్రజలంతా జేజేలు పలికారు. ఇవండీ! పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత ఈ ఏడాది కాలంలో చోటుచేసుకున్న కీలక పరిణామాలు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version