ఒకప్పుడు ఉపాధ్యాయురాలుగా పనిచేసిన ఏపీ మంత్రి పుష్ప శ్రీవాణి .. భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. కురుపాం అసెంబ్లీ స్థానం నుంచి ఎస్టీ కోటాలో పోటీ చేసిన ఆమె రెండోసార్లు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో 27 ఏళ్ల వయసులో శ్రీవాణి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం గమనార్హం. అయితే అతి పిన్న వయసులోనే ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో చోటు దక్కించుకుని రికార్డు సృష్టించిన గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఇంటి అద్దెను ప్రభుత్వం గురువారం మంజూరు చేసింది.
మంత్రి అయిన తర్వాత పుష్పశ్రీవాణి విజయవాడలోని వివేకానంద కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఆ ఇంటికి నెలకు లక్ష రూపాయల అద్దె కాగా, క్యాంపు కార్యాలయ అలవెన్సుగా మరో రూ. 5 వేలను మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పుష్ప శ్రీవాణి వివాహం తర్వాత విజయనగరం జిల్లా జియమ్మవలస మండలంలోని చినమేరంగి కోటలో స్థిరపడ్డారు.