నేను రోజు నా సైకిల్ ను ఉదయం లేవగానే శుభ్రం చేసుకుంటా. రోజూలాగే ఆదివారం ఉదయం కూడా లేచి దాన్ని శుభ్రం చేద్దామని దాన్ని పార్క్ చేసిన దగ్గరికి వెళ్లా. అక్కడ చూస్తే నా సైకిల్ కనిపించలేదు.
ప్లీజ్ సార్.. ప్లీజ్… ఆ సైకిల్ అంటే నాకు చాలా ఇష్టం. అది లేకుండా నేను ఉండలేను. నేను లేకుండా కూడా అది ఉండలేదు. అది నా బెస్ట్ ఫ్రెండ్. మా నాన్న నాకు ఎంతో ప్రేమతో నా పుట్టిన రోజున కొనిచ్చాడు. అప్పటి నుంచి నేను దాన్ని నాకన్నా ఎక్కువగా చూసుకుంటున్నా. కానీ… నా బుజ్జి బంగారం నిన్నటి నుంచి కనిపించడం లేదు సార్.. మీరే ఎలాగైనా నా సైకిల్ ను కనిపెట్టాలి.. ప్లీజ్ సార్.. మీరు పెద్ద పెద్ద దొంగలనే అలవోకగా పట్టేసుకుంటారట కదా. నా సైకిల్ ఒక లెక్కా. తొందరగా వెతికి నా సైకిల్ ను నా దగ్గరికి చేరేలా చూడండి సార్.. అంటూ ఎనిమిదో తరగతి చదివే పిల్లోడు పోలీసులను బతిమాలాడు.
హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకున్నది. తన సైకిల్ పోయిందని.. ఎలాగైనా దాన్ని వెతికి అప్పగించాలని ఆ బాలుడు.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అంతే కాదు.. తనకు ఆ సైకిల్ ఎంత ముఖ్యమో కూడా పోలీసులకు వివరించాడు.
ఇంతకీ.. ఆ సైకిల్ ఎలా మిస్సయిందిరా బుడ్డోడా అని అడిగితే.. ఏమన్నాడంటే… సార్.. నేను రోజు నా సైకిల్ ను ఉదయం లేవగానే శుభ్రం చేసుకుంటా. రోజూలాగే ఆదివారం ఉదయం కూడా లేచి దాన్ని శుభ్రం చేద్దామని దాన్ని పార్క్ చేసిన దగ్గరికి వెళ్లా. అక్కడ చూస్తే నా సైకిల్ కనిపించలేదు. రాత్రి పడుకునే ముందు అక్కడే పెట్టా. తెల్లారి లేచి చూసేసరికి అది లేదు. అక్కడా ఇక్కడా వెతికా. ఎక్కడా కనిపించలేదు. అందుకే మీ దగ్గరికి వచ్చా సార్. ఎలాగైనా నా సైకిల్ వెతికి పట్టుకోండి.. సార్ అంటూ ఆ బాలుడు పోలీసులను బతిమాలేసరికి.. పోలీసులు కూడా ఆ సైకిల్ ను వెతకడం కోసం బయలు దేరారట. తప్పదు కదా.. ఆ బాలుడేమో సైకిల్ వెతికి తీసుకొచ్చే సరికి వదిలేలా లేడు. చూద్దాం.. ఈ కేసును ఎస్సార్ నగర్ పోలీసులు ఎలా డీల్ చేస్తారో?