హనుమాన్ ఆలయంలో రావిచెట్టుకు క‌న్నీరు..!

మనదేశంలో అంతుచిక్కని ఎన్నో వింతలు జ‌రుగుతుంటాయి. వాటిని కొంద‌రు దేవుడి మ‌హిమ అంటే.. మ‌రికొంద‌రు సైన్స్ అంటారు. ఎక్క‌డ ఏ వింత జ‌రిగినా దాన్ని చూడ‌డానికి గుంపులుగా వెళ్తుంటారు. జ‌రిగింది చిన్న‌దే అయినా దాన్ని ఓ పెద్ద వింత‌గా క్రియేట్ చేసి చూస్తుంటారు. పాము గుడి చుట్టూ ప్రద‌క్షిణ‌లు చేసింద‌ని, దేవుడు నైవేద్యం స్వీక‌రిస్తున్నాడ‌ని, శివ‌లంగం నుంచి పాలు వ‌స్తున్నాయ‌ని ఇలా ర‌క‌ర‌కాల వింత‌లు విశేషాలు మ‌నం వింటూనే ఉంటాం.

అవి అస‌లు ఎలా జ‌రిగాయో తెలియ‌కుండానే వాటిని దేవుడి మ‌హిమా.. వింత‌ల‌కే వింత‌ అంటూ సృష్టిస్తారు. అలాంటి వింతే ఇప్పుడు వ‌రంగ‌ల్‌లో చోటుచేసుకుంది. రావిచెట్టు నుంచి క‌న్నీరు వ‌స్తున్నాయి.. ఈ వింత‌ను తిల‌కించ‌డానికి ప్ర‌జ‌లు గుంపులు గుంపులుగా వ‌స్తున్నారు. మ‌రి వివ‌రాల్లోకి వెళ్తే.. వ‌రంగ‌ల్ జిల్లాలో వర్థన్నపేట మండలం ఇల్లందలోని హనుమాన్ ఆలయంలో భారీ రావి వృక్షాన్ని గుర్తుతెలియని వ్యక్తి నరికి వేశాడు.


ఆలయంలోని రావిచెట్టును నరకడంపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రావిచెట్టు నుంచి నీరు కారుతోంది. దీంతో చెట్టు కన్నీరు పెడుతోందని అదంతా దేవుడి మహిమేనని స్థానికులు భావిస్తున్నారు. నీరు కారుతున్న రావిచెట్టును చూసేందుకు జనం తండోపతండాలుగా వ‌స్తున్నారు. ఇది ప్ర‌స్తుతం ఓ పెద్ద వింత‌గా ఉంది.