రష్యాలోని ముర్‌మాన్‌స్క్ ప్రాంతంలో ఉన్న ఉంబా అనే నదిపై 75 అడుగుల పొడవున్న బ్రిడ్జి ఒకటుంది. అయితే ఇటీవలే ఆ బ్రిడ్జి రాత్రికి రాత్రే మాయమైంది.
మాయలు, మంత్రాలు వస్తే.. ఏ వస్తువునైనా.. మనిషినినైనా.. ఎంతటి భారీ నిర్మాణాన్నయినా చేయి అలా తిప్పి చిటికెలో మాయం చేయవచ్చు. ఇలాంటి మంత్ర తంత్రాలను మనం సినిమాల్లో చూస్తుంటాం. అయితే నిజ జీవితంలో మంత్ర తంత్రాలు ఏవీ పనిచేయవు. లేవు కూడా. కానీ ఆ నదిపై ఉన్న ఓ బ్రిడ్జి మాత్రం నిజంగానే ఎవరో మంత్రం వేసినట్లుగా రాత్రి రాత్రే మాయమైపోయింది. కనీసం దాని శిథిలాలు కూడా ఏమీ లేవు. అసలది కూలిందా.. లేదా.. అన్న సంగతి కూడా తెలియదు. ఈ వింత రష్యా దేశంలో చోటు చేసుకుంది.
రష్యాలోని ముర్‌మాన్‌స్క్ ప్రాంతంలో ఉన్న ఉంబా అనే నదిపై 75 అడుగుల పొడవున్న బ్రిడ్జి ఒకటుంది. అయితే ఇటీవలే ఆ బ్రిడ్జి రాత్రికి రాత్రే మాయమైంది. అవును నిజమే.. దీంతో ఈ ఘటన అక్కడ సంచలనాన్ని కలిగిస్తోంది. అసలు బ్రిడ్జి ఎలా మాయమై ఉంటుంది, ఎవరైనా మంత్రం వేశారా.. అంత భారీ నిర్మాణం ఎలా మాయమవుతుంది..? అని రకరకాలుగా అందరూ చర్చించుకుంటున్నారు. కాగా మాయమైన ఆ బ్రిడ్జి బరువు 50 టన్నులు ఉంటుందని చెబుతున్నారు.
అయితే ఆ బ్రిడ్జికి కొంత కాలం కిందటే పగుళ్లు వచ్చాయట. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు ఆ బ్రిడ్జి కూలి నదిలో కొట్టుకుపోయి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. అలా అయితే అసలు ఆ బ్రిడ్జి శిథిలాలు నదిలో ఉండాలి కదా. కానీ అలాంటి ఆనవాళ్లేమీ నదిలో కనిపించకపోవడం మిస్టరీగా మారింది. ఇక కొందరైతే.. ఆ బ్రిడ్జిని ఎవరో దొంగిలించి ఉంటారని, దాన్ని చిన్న ముక్కలుగా చేసి అందులో ఉన్న పార్ట్‌లను తీసి అమ్ముకుని ఉంటారని కూడా చెబుతున్నారు.
అయితే నిజానికి మాయమైన బ్రిడ్జి బరువు 50 టన్నులు ఉంటే.. అంత భారీ నిర్మాణాన్ని రాత్రికి రాత్రే తొలగించి కట్ చేసి అక్కడి నుంచి తరలించడం అసాధ్యం. అలాంటప్పుడు ఆ పని దొంగలు చేసి ఉంటారని అనుకోవడం కూడా పొరపాటే అవుతుందని కొందరు అంటున్నారు. మరి.. అసలు బ్రిడ్జి ఎలా మయామై ఉంటుందోనని ఇప్పుడు పోలీసులు అక్కడ విచారణ చేస్తున్నారు. మరి.. మాయమైన బ్రిడ్జి సంగతి తెలుస్తుందో.. లేదో.. కొన్ని రోజులు ఆగితే ఆ మిస్టరీ వెనుక ఉన్న అసలు కథ ఏమిటో తెలిసిపోతుంది. అప్పటి వరకు వేచి చూడక తప్పదు..!