ఇంట్లో సహజంగానే కొన్ని సార్లు మనం పొరపాట్లు చేస్తుంటాం. ఒక వస్తువుకు బదులుగా పొరపాటుగా మరొక వస్తువును వాడుతుంటాం. నిజం తెలిసే సరికి జరగాల్సింది జరిగిపోతుంది. అయితే ఇలాంటి సంఘటనలు కొన్ని సార్లు హాస్యాస్పదంగా మారుతుంటాయి. ఆ వ్యక్తి విషయంలోనూ అలాగే జరిగింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ అనే ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల రొనాల్డ్ వాకర్ తరచూ ముఖం మొత్తానికి షేవింగ్ క్రీమ్ అప్లై చేసి షేవింగ్ చేసుకుంటుంటాడు. అందులో భాగంగానే అతను తాజాగా ఒక రోజు షేవింగ్ చేసుకుందామని చూస్తే అందులో క్రీమ్ లేదు. అయిపోయింది. పక్కనే ఇంకో బాటిల్ కనిపించింది. అందులో క్రీమ్ ఉంది. దీంతో అది షేవింగ్ క్రీమ్ అనుకుని ముఖం మొత్తానికి రాసుకున్నాడు. కానీ తరువాతే అసలు విషయం తెలిసింది.
ఆ క్రీమ్ రాసుకున్నాక అతని ముఖం మొత్తం ఎర్రగా మారి దురద రాసాగింది. దీంతో అనుమానం వచ్చిన రొనాల్డ్ తన సోదరుడికి ఫోన్ కాల్ చేసి అడగ్గా అది షేవింగ్ క్రీమ్ కాదని, హెయిర్ రిమూవల్ క్రీమ్ అని చెప్పాడు. దీంతో ఖంగు తిన్న రొనాల్డ్ వెంటనే ముఖం కడిగేసుకున్నాడు. అయితే అప్పటికే అతని కనుబొమ్మలపై ఉన్న వెంట్రుకలు కొన్ని పోయాయి. అతను గడ్డం, మీసాలు పెంచడు. కనుక పెద్దగా నష్టం జరగలేదు. ఇక అతను తనకు ఇలా జరిగిందని చెప్పి తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆ ఫొటోలకు ఫన్నీగా స్పందిస్తున్నారు.