ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక్కో ఆహారం పట్ల ఆసక్తి ఉంటుంది. తమకు ఇష్టమైన ఆహారాలనే వారు తింటుంటారు. అయితే ఆ వ్యక్తి మాత్రం గత కొన్నేళ్లుగా కేవలం రాళ్లను మాత్రమే తిని బతుకుతున్నాడు. అవును. నిజమే. మహారాష్ట్రలోని సత్రా జిల్లా అడార్కి ఖుర్ద్ గ్రామానికి చెందిన 78 ఏళ్ల రామ్‌దాస్ బొడ్కె గత 32 ఏళ్లుగా రోజూ రాళ్లను తింటున్నాడు.
రామ్‌దాస్‌కు చాలా ఏళ్ల కిందట తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. ఎంత మంది డాక్టర్ల వద్దకు వెళ్లినా, ఎన్ని చికిత్సలు చేయించుకున్నా కడుపు నొప్పి తగ్గలేదు. దీంతో తమ గ్రామంలో ఉండే ఓ మహిళ రాళ్లను తినాలని చెప్పింది. దీంతో అతను రాళ్లను తినడం ప్రారంభించాడు. అయితే అనూహ్యంగా అతని కడుపునొప్పి మాయమైంది. దీంతో అతను రాళ్లను తినడం అలవాటు చేసుకున్నాడు. దాన్నే 32 ఏళ్లుగా కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను నిత్యం 250 గ్రాముల వరకు రాళ్లను తింటాడు.
అయితే కుటుంబ సభ్యులు ఎంత వద్దని వారించినా అతను వినడం లేదు. వారికి తెలియకుండా చాటుగా రాళ్లను తెచ్చుకుని తింటున్నాడు. ఈ క్రమంలో రాళ్లను తింటున్నా అతను ఎలా జీవించి ఉండగలుగుతున్నాడు.. అనే విషయం వైద్యులకు అంతుబట్టడం లేదు. మరోవైపు.. అతనికి మానసిక సమస్యలు ఉండి ఉంటాయని, అందుకనే అతను రాళ్లను తింటుండవచ్చని సైకాలజిస్టులు చెబుతున్నారు. అతనికి సైకాలజీ పరంగా చికిత్స ఇవ్వాలని అంటున్నారు.