దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే నగారా మోగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లతోపాటు ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్నికల సమరకంలోకి దిగాయి. పోటా పోటీగా వాడిగా వేడిగా ప్రచారాలు మొదలు పెట్టేశాయి. పలు చోట్ల అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లను కూడా వేశారు. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అయితే తమిళనాడులో ఓ చోట ఓ అసెంబ్లీ నియోజకవర్గం తరఫు నుంచి పోటీ చేయడం కోసం ఓ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేసేందుకు వచ్చాడు. ఈ క్రమంలో అతని వేషధారణ చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా అలంగుళం నియోజకవర్గం నుంచి హరి నాడార్ అనే వ్యక్తి ఎమ్మెల్యే పదవి కోసం పోటీ చేసేందుకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. ఈ క్రమంలోనే అతను రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 5 కిలోల బంగారం ధరించి వచ్చాడు. తరువాత తన నామినేషన్ పేపర్లను రిటర్నింగ్ అధికారికి అందజేశాడు. కాగా తన ఎన్నికల అఫిడవిట్‌లో అతను తనకు 11.2 కిలోల బంగారం ఉందని తెలపడం విశేషం.
తమిళనాడులో ఏప్రిల్ 6వ తేదీన ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఫలితాలు మాత్రం మే 2వ తేదీన ప్రకటిస్తారు. ఇప్పటికే డీఎంకే కాంగ్రెస్‌లు పొత్తు పెట్టుకోగా, బీజేపీ, అన్నాడీఎంకేలు పొత్తుతో పోటీ చేస్తున్నాయి. మరో వైపు కమలహాసన్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అలాగే డీఎంకే ఇటీవలే భారీ వాగ్దానాలతో కూడిన మ్యానిఫెస్టోను కూడా విడుదల చేసి ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడింది. ఈ క్రమంలో తమిళనాట ఎన్నికలు రసవత్తరంగా మారాయి.