షాకింగ్‌.. గూగుల్‌ డొమెయిన్‌ను కేవలం రూ.200కే కొన్నాడు..!

ప్రపంచంలోని అతి పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో గూగుల్‌ ఒకటి. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెట్‌లో గూగుల్‌ 86 శాతం వాటాను కలిగి ఉంది. ప్రపంచంలో చాలా మంది ఎప్పుడు ఏది సెర్చ్‌ చేసినా దాదాపుగా అధిక శాతం వరకు గూగుల్‌ను ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రతి దేశంలోనూ తమ స్థానిక డొమెయిన్‌లను గూగుల్‌ ఎప్పుడో కొనేసింది. కానీ ఓ డొమెయిన్‌ మాత్రం యాదృచ్ఛికంగా ఓ వ్యక్తికి లభ్యమైంది.

man purchased google domain for only rs 200

అర్జెంటీనాకు చెందిన నికోలాస్‌ కురోనా అనే 30 ఏళ్ల వెబ్‌ డిజైనర్‌ ఇటీవలే గూగుల్‌కు చెందిన అర్జెంటీనా డొమెయిన్‌ను కేవలం రూ.200కే కొన్నాడు. నిజానికి ఆ డొమెయిన్‌ గూగుల్‌దే. కానీ సర్వర్లు డౌన్‌ ఉండడం, సాంకేతిక సమస్య కారణంగా ఆ డొమెయిన్‌ కొనేందుకు అందుబాటులో ఉన్నట్లు వచ్చింది. దీంతో వెంటనే కురోనా 2 పౌండ్లు (దాదాపుగా రూ.207)కు గూగుల్‌ అర్జెంటీనా డొమెయిన్‌ google.com.ar ను కొన్నాడు.

అయితే అతను ఆ డొమెయిన్‌ను కొన్నాక ఆ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేశాడు. తనకు ఎలాంటి దురుద్దేశం లేదని, ఆ డొమెయిన్‌ కొనేందుకు అందుబాటులో ఉన్నట్లు కనిపించిందని, అందుకనే కొన్నానని తెలిపాడు. కానీ అతను ఆ డొమెయిన్‌ను కొన్నాక కొంత సేపటికి గూగుల్‌ తన డొమెయిన్‌ను తాను ఆధీనంలోకి తీసుకుంది. అయితే డొమెయిన్‌ కొన్నాక దాన్ని బ్రౌజర్‌లో ఓపెన్‌ చేస్తే కొంత సేపు కురోనాకు చెందిన సమాచారం వచ్చింది. తరువాత గూగుల్‌ ఆ డొమెయిన్‌ను వెనక్కి తీసుకుంది.