విమానంలో తేలు.. భయాందోళనలకు గురైన ప్రయాణికులు.. వీడియో..!

-

మీరు ప్రయాణిస్తున్న  విమానంలో మీ పైనే సీలింగ్‌కు ఓ తేలు ఉంటే.. దాన్ని మీరు చూస్తే.. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది ? ఏంటీ.. ఊహించుకోవడానికే చాలా భయంగా ఉందా..? అవును.. ఎవరికైనా అలాంటి స్థితిలో ఉంటే తీవ్రమైన భయం కలుగుతుంది. సరిగ్గా ఆ విమానంలో ఉన్న ప్రయాణికులకు కూడా ఇలాంటి స్థితే ఎదురైంది. అయినప్పటికీ వారందరూ ఆ తేలు నుంచి సురక్షితంగా తప్పించుకున్నారు. ఇంతకీ అసలు జరిగిందేమిటంటే…

ఇండోనేషియాకు చెందిన లయన్‌  ఎయిర్‌ లైన్స్‌ విమానం జేటీ-293 రియావో నుంచి బాంటెన్‌ వెళ్తోంది. అయితే విమానం గమ్యస్థానానికి చేరాక అందులో ప్రయాణిస్తున్న  ఓ వ్యక్తి విమానంలో సీలింగ్‌లో ఉన్న తన లగేజీ తీసుకునేందుకు పైకి లేచాడు. ఆ సమయంలో తన తలపైనే సీలింగ్‌ లోపల  ఓ తేలు అతనికి కనిపించింది. దీంతో అతనికి పై ప్రాణాలు పైనే పోయాయి. తీవ్ర భయంతో అతను ఇతర ప్రయాణికులకు ఆ విషయం చెప్పాడు.

ఈ క్రమంలో ఆ విమానంలో ఉన్న తోటి ప్రయాణికులు తేలు విషయం తెలుసుకుని వారు కూడా భయపడ్డారు. వెంటనే తమ తమ లగేజీలను తీసుకుని విమానం నుంచి బయటపడ్డారు. ఈ కంగారులో అందరూ వేగంగా బయటకు పరిగెత్తారు. కానీ ఎవరినీ ఆ తేలు కుట్టలేదు. దీంతో అందరూ బతుకు జీవుడా.. అంటూ విమానం నుంచి బయట పడ్డారు.

అయితే ఆ తేలు నిజానికి చాలా విషపూరితమైందట. అందుకే ప్రయాణికులు తీవ్రంగా ఆందోళన చెందారు. ఆ తేలు సీలింగ్‌లో పాకుతున్నప్పుడు ఎవరో దాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో కాస్తా వైరల్‌ అయింది. అయితే ప్రయాణికుల ఫిర్యాదు స్వీకరించిన సదరు ఎయిర్‌ లైన్స్‌ సంస్థ వెంటనే విమానం మొత్తం తనిఖీ చేయించింది. కానీ వారికి మాత్రం ఆ తేలు కనిపించలేదట. అయినప్పటికీ ఆ విషయాన్ని సీరియస్‌గానే  తీసుకుంటామని, మరొక్క సారి క్షుణ్ణంగా వెదికి తేలును పట్టుకుంటామని, అది విమానంలోకి ఎలా వచ్చిందో తెలుసుకుంటామని ఆ ఎయిర్‌  లైన్స్‌ కంపెనీ చెబుతోంది. ఏది ఏమైనా.. ప్రయాణాల్లో ఇలాంటి ఘటనలు జరిగితే ఎవరికైనా తీవ్రంగా భయమేస్తుంది కదా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version