దీపావ‌ళి రోజున బాణ‌సంచా కాల్చ‌డం ఎలా ప్రారంభ‌మైందో తెలుసా..?

క్రీస్తు శ‌కం 600 నుంచి 900 సంవ‌త్స‌రం న‌డుమ చైనీయులు వెదురు బొంగుల‌తో బాణ‌సంచా త‌యారు చేశార‌ని చరిత్ర చెబుతోంది. కానీ నిర్దిష్టంగా ఎప్పుడు బాణ‌సంచాను త‌యారు చేశారో తెలియ‌దు.

దీపావళి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది టపాసులు. పిల్లలు, యువత దీపావళి పండుగ రోజు టపాసులను పేల్చేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుంటారు. బాణసంచా పేలుస్తూ వారు పండుగ రోజు ఎంజాయ్ చేస్తుంటారు. అయితే దీపావళి అంటే హిందూ సంప్రదాయం ప్రకారం నరకాసురున్ని వధించిన రోజు. మరి దానికి, బాణసంచా పేల్చ‌డానికి సంబంధం ఏమిటి ? అసలు దీపావళి రోజున బాణసంచా కాల్చడం ఎలా వచ్చింది ? దీన్ని ఎప్పటి నుంచి ప్రారంభించారు ? అన్న వివ‌రాల‌ను ఒక్క‌సారి ప‌రిశీలిస్తే..

how bursting fire crackers started on diwali

దీపావ‌ళి రోజున బాణ‌సంచా కాల్చ‌డం ఎప్ప‌టి నుంచి ప్రారంభ‌మైంది.. అన్న దానికంటే ముందుగా.. అస‌లు బాణ‌సంచాను ఎప్పుడు త‌యారు చేశారు ? ఎక్క‌డ మొద‌ట దాన్ని వాడారు ? అన్న వివ‌రాల‌ను తెలుసుకుందాం. క్రీస్తు శ‌కం 600 నుంచి 900 సంవ‌త్స‌రం న‌డుమ చైనీయులు వెదురు బొంగుల‌తో బాణ‌సంచా త‌యారు చేశార‌ని చరిత్ర చెబుతోంది. కానీ నిర్దిష్టంగా ఎప్పుడు బాణ‌సంచాను త‌యారు చేశారో తెలియ‌దు. అయితే వారు అప్ప‌ట్లో దుష్ట‌శ‌క్తుల‌ను, ఆత్మ‌లు, దెయ్యాల‌ను త‌రిమేందుకు బాణ‌సంచా కాల్చేవార‌ట‌. అది నెమ్మ‌దిగా ఇత‌ర దేశాల‌కు విస్త‌రించింది.

మొద‌ట్లో మ‌న దేశంలోనూ పండుగ‌లు, శుభ కార్యాల స‌మ‌యంలో బాణ‌సంచాను కాల్చేవారు. కానీ త‌రువాత దీపావ‌ళి రోజున కూడా బాణ‌సంచా కాల్చ‌డం నెమ్మ‌దిగా ప్రారంభ‌మైంది. ఆ రోజున న‌ర‌కాసురుని బారి నుంచి ప్ర‌జ‌ల‌కు విముక్తి క‌లిగి, వారి జీవితాల్లో వెలుగు వ‌చ్చినందునే అప్ప‌టి నుంచి ప్ర‌జ‌లు దీపావ‌ళి పండుగ‌ను జ‌రుపుకుంటున్నారు. ఆ రోజున కేవ‌లం దీపాల‌ను వెలిగించే సాంప్ర‌దాయం మాత్ర‌మే మొద‌ట్లో ఉండేది. ఆ త‌రువాత నెమ్మ‌దిగా బాణ‌సంచా రాక‌తో దీపావ‌ళి రోజున ట‌పాసుల‌ను పేల్చ‌డం కూడా ఆన‌వాయితీగా వ‌స్తోంది. ప్ర‌త్యేకంగా ఎప్ప‌టి నుంచి దీపావ‌ళి రోజున బాణ‌సంచా కాల్చ‌డం ప్రారంభ‌మైందో తెలియ‌దు కానీ.. న‌రకాసురుని వంటి దుష్ట‌శ‌క్తుల‌ను త‌రిమేయ‌డానికి హిందువులు కూడా బాణ‌సంచాను కాల్చ‌డం మొద‌లైంది. ఇక అదిప్పుడు వ్యాపారం అయింది. అదీ దీపావ‌ళి బాణ‌సంచా వెనుక ఉన్న మ‌న‌కు తెలిసిన విష‌యం..!