దసరా స్పెషల్: అమ్మవారి దశావతారాలు చెప్పే సందేశం ఏంటో తెలుసా?

-

దసరా వస్తుంది అంటేనే దేవీ నవరాత్రి ఉత్సవాలు.. గర్బ డ్యాన్స్.. దాండియా నృత్యాలు. దసరాకు పదిరోజుల ముందే దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతాయి. నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక్కో అవతారంలో దుర్గా మాతను కొలుస్తాం.. పూజిస్తాం. ఈ లోకాన్ని రక్షించడానికి విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తినట్టుగా… రాక్షసుల అంతానికి… లోక రక్షణ కోసం దేవీమాత కూడా దశావతారాలు ఎత్తుతుంది. మరి దశావతారాలు మనకు ఇచ్చే సందేశం ఏంటి? అవి మనకు ఏం చెబుతాయి. ఒక్కోరోజు ఒక్కో అవతారం సరే. ఆ అవతారాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి..?

 

అమ్మవారి దశావతారాల్లో మొదటిది స్వర్ణకవచ దుర్గ. నిన్ను నువ్వే రక్షించుకోవాలి. నిన్ను నువ్వు రక్షించుకోవడం కోసం నువ్వు ఎంతో దైర్యంగా.. దృఢంగా ఉండాలి. దాని కోసం నీకు మంచి వ్యక్తిత్వం ఉండాలి.

బాలాత్రిపుర సుందరి.. నీలో ఉన్న బాల్యాన్ని ఆస్వాదించు. ఉల్లాసంగా ఉండు.. ఉత్సాహంగా బతుకు.. నీ జీవితాన్ని నువ్వే జీవించు. అదే బాలాత్రిపుర అమ్మవారి సందేశం.

అన్నపూర్ణా దేవి.. అన్నపూర్ణ అంటే ఆరోగ్యంగా జీవించు అని అర్థం. నువ్వు ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సినదాన్ని నువ్వే ఇవ్వాలి. అంటే నీ ఆరోగ్యాన్ని నువ్వే కాపాడుకోవాలి. వేరే వాళ్లు కాపాడరు. ఆరోగ్యమంటే ఒక్క శరీర ఆరోగ్యమే కాదు.. నువ్వు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి.. నీ ఆలోచనలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. అవే నీకు సకల లోకాలను గెలిచే శక్తిని ఇస్తాయి. నీ శక్తిని ఇతరులకు పంచు.. అని చెబుతుంది అన్నపూర్ణదేవి అవతారం అమ్మవారు.

గాయత్రీదేవి.. నువ్వు నీ ఆధీనంలో ఉండాలి. దాని కోసం నువ్వు శ్రమించాలి. అంటే నీ బలం, బలగం అంతా నువ్వే. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా.. పోరాడటానికి సిద్ధంగా ఉండు. అప్పుడే నువ్వు ప్రపంచాన్ని జయించగలవు.

లలితాత్రిపుర సుందరి.. ఈ ప్రపంచంలో నీ అంత అందంగా ఎవరూ ఉండరు. నీదే అత్యంత సౌందర్యం. నీ ఆత్మసౌందర్యం ముందు ఏదీ పనికిరాదు. నీ ఆత్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి మంచి ఆలోచనలు చేయి. మంచి పనులు చేయి. అవే నీ ఆత్మసౌందర్యాన్ని పెంచుతాయి. అప్పుడే నీకు అసలైన ఆనందం కలుగుతుంది.. అని చెబుతుంది లలితాత్రిపుర సుందరి అమ్మవారు.

సరస్వతీ దేవి.. నీకు జీవిత సారం తెలియాలి. అంటే ఈ ప్రపంచాన్ని నువ్వు చదవాలి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. నువ్వు చూసిందే కాదు.. నువ్వు చూడనిది.. నీకు తెలియనిది.. అన్నింటినీ చూడు.. అన్నింటినీ తెలుసుకో. అవే నిన్ను శక్తిమంతుడిని చేస్తాయి. నువ్వు తెలుసుకున్నది గోరంత. నువ్వు తెలుసుకోవాల్సింది కొండంత అనే విషయం గుర్తుపెట్టుకో. నీకు తెలుసుకోవాలన్న తపన ఉండాలి. అది ఉంటే ఎలాగోలా బతికేయొచ్చు.

మహాలక్ష్మీదేవి.. స్వతంత్రంగా ఉండండి. నీ భవిష్యత్తుకు నువ్వే ప్రధాతవు. నీ లక్ష్యాలను నువ్వే నిర్ధేశించుకోవాలి. నీ లక్ష్యాల కోసం నువ్వే పనిచేయాలి. నీ లక్ష్యాల ద్వారా ఏం సంపాదించాలి.. ఎలా సంపాదించాలి అనే విషయాలను లక్ష్మీదేవి అవతారమే చెబుతుంది.

దుర్గాదేవి.. నిన్ను నువ్వు ఓ శక్తిగా మార్చుకోవడానికి సరైన నిర్ణయాలు తీసుకో. నువ్వే ఓ అద్భుతం. నువ్వు కోరుకున్న స్థానం దక్కడం కోసం నిరంతరం శ్రమించు. అందరిలో ఒకడిలా కాకుండా.. అందరికంటే భిన్నంగా ఉండేలా చూసుకో. ఇవన్నీ చేయాలంటే నిన్ను నువ్వు మార్చుకోవాలి.

మహిషాసుర మర్దిని.. దేవీ ఉగ్రరూపం దాల్చడమే మహిషాసుర మర్దిని అంటే నీ శక్తిని తక్కువ అంచనా వేయకుండా నీ లక్ష్యం కోసం పనిచేయి. అందరికీ అందనంత ఎత్తుల్లో ఉండడం కోసం శ్రమించు. మహిషాసుర మర్దినిగా అమ్మవారు అవతరించిన రోజునే మహార్నవమిగా జరుపుకుంటాం.

రాజరాజేశ్వరీ దేవి.. విజయదశమి రోజున అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిగా అవతారమెత్తుతుంది. విజయం సాధించాలంటే నీకున్న భ్రమలనుంచి ముందు బయటపడాలి. నిజమైన జీవితమంటే శాంతంగా ఉండటం. శాంతి కోసం వెతుకు. అన్నింటినీ జయిస్తేనే జీవితం అని చెబుతుంది రాజరాజేశ్వరీ దేవి.

Read more RELATED
Recommended to you

Latest news