ఆశ్వీజమాసం.. అంటే చాలు ప్రసన్నమైన శరత్‌కాలం. మనస్సును పరవశింపచేసే కాలం. వర్షాకాలం వెళ్లి శీతాకాలం ప్రారంభమయ్యే వేళ ఇది. ఈ సమయంలో శక్తి స్వరూప ఆరాధన చాలా ముఖ్యం. సనాతన ధర్మం ఆశ్వీజమాసాన్ని శక్తి ఆరాధనకు కీలకంగా పేర్కొంది. శక్తి అంటే లక్ష్మీ, పార్వతీ, కాళీ, సరస్వతి.. ఇలా ఈ పేరున పిల్చినా పలికే అమ్మ.. శ్రీ లలితా సహస్రనామంలో పేర్కొన్నట్లు అమ్మ.. శ్రీమాతా, శ్రీమహారాజ్ఞి, శ్రీసింహాసనేశ్వరీ. అంటే సృష్టి, స్థితి, లయకారిణి ఆమ్మే. త్రిమూర్తులకు.. దశావతారాలకు అన్నింటికి మూలం అమ్మే. ఆ పరాశక్తిని ఉపాసన చేస్తూ నిర్వహించే కార్యక్రమాలే దసరా ఉత్సవాలుగా ప్రాచుర్యం పొందాయి. ఆశ్వయుజ మాసానికి ఇష మాసం అనే పేరు ఉంది. అశ్వనీ నక్షత్రంతో కూడిన పూర్ణిమ వచ్చే మాసాన్ని ఆశ్వయుజ మాసం అంటారు.
శరత్ రుతువు
ఆశ్వీజమాసం శరత్‌రుతువులో వస్తుంది. ఈ కాలంలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టి ప్రకృతి కొత్త శోభను సంతరించుకుంటుంది. ఈ మాసంలో వెన్నెల అత్యధికంగా కాస్తుంది. శరత్కాలంలోని తొలి పదిరాత్రులు జరుపుకొనే దేవీ నవరాత్రులు అనేక రుగ్మతలను నివారిస్తాయి. విజయాన్ని చేకూరుస్తాయని పురాణాలు చెపుతాయి.
శరన్నవరాత్రుల విశేషాలు
– ఆశ్వీజ పాడ్యమి నుంచి మహర్నవమి వరకు నవరాత్రులు నిర్వహించి దశమినాడు పూర్తి చేస్తారు. దీనిలో మొదటి మూడు రాత్రులు పార్వతి, మధ్య మూడు రోజులు లక్ష్మీదేవి, చివరి మూడు రోజులు సరస్వతిని ఆరాధిస్తారు.
ప్రకృతి నియమాలను అనుసరించి ఈ శరత్కాలం సంధికాలం. ప్రజలకు అనారోగ్యాన్ని కలిగించి, వారి ప్రాణాలను హరించే శక్తి ఈ కాలానికి ఉంటుంది. బాధలకు లోనుకాకుండా జగన్మాతను వేడుకుంటూ చేసే ఉత్సవమే నవరాత్రి ఉత్సవం. హస్తా నక్షత్రంతో కూడిన జ్యేష్ఠ దశమికి దశహరా అనే పేరు ఉంది. పది జన్మల పాపాలను, పది రకాలైన పాపాలను పొగొట్టేది అనే అర్థం కూడా ఉంది.
రాత్రి అంటే తిథి అనే అర్థం ఉంది. దీని ప్రకారం ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి నుంచి నవమి వరకు జరిగే ఉత్సవాలే నవరాత్రి ఉత్సవాలు. తొమ్మిది రోజుల పాటు నియమాల ప్రకారం అర్చనలు చేయలేని వారు చివరి మూడు రోజులు అంటే అష్టమి, నవమి, దశమి రోజుల్లో అయినా దుర్గాదేవిని అర్చిస్తే, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రవచనం. మూలా నక్షత్రంతో కూడిన షష్ఠి లేదా సప్తమి రోజున సరస్వతీదేవిని పూజిస్తారు. ఈ రోజున పుస్తకదానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దశమి రోజున వేద పండితులను, బ్రాహ్మణులను, మహిళలను సత్కరించటం చేస్తే అమ్మ అనుగ్రహానికి పాత్రులవుతారని శాస్త్ర ప్రవచనం.
– కేశవ