మూడు రోజులు జరుపుకునే పెద్ద పండుగని ఎంతో ఆనందంగా ప్రతి ఒక్కరు జరుపుకుంటారు. పచ్చని తోరణాలతో ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. ఇల్లంతా కూడా కళకల్లాడుతూ ఉంటుంది. సంక్రాంతి రోజున లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఈ పండుగని జరుపుకుంటారు.
ఇక మూడో రోజు వేసే కనుమ పండుగ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. కనుమని పశువుల పండుగ అని అంటారు. భారతీయ హిందూ ధర్మం ప్రకారం ఇంటికొచ్చిన పంటనే గొప్ప సంస్కృతిగా ఆచరిస్తారు. పల్లెల్లో నిజానికి పశువులే గొప్పసంపద. అవి ఆనందంగా ఉంటేనే రైతులకి ఆనందం. పైగా పంట పొలాల్లో కూడా పశువులు ఎక్కువగా ఉపయోగపడతాయి. కనుమ రోజున ఇంటిని శుభ్రపరిచి అలాగే పశువులను కూడా శుభ్రం చేస్తారు.
వైభవంగా ఈ పండుగను పల్లెల్లో జరుపుతారు. పశువుల పట్ల కృతజ్ఞతగా రైతులు ఈ పండుగ చేస్తారు. నదీ తీరానికి కానీ చెరువుల దగ్గరికి కానీ పశువులను తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేయిస్తారు. వాటికి అందంగా కుంకుమ అద్ది మువ్వల పట్టీలు కడతారు. అలంకరణ మొత్తం అయిపోయాక పూజ చేసి హారతి ఇస్తారు. అలానే వాటికి ఇష్టమైన ఆహారాన్ని ఇచ్చిన తర్వాత ఉత్సవంగా ఊరేగిస్తారు.
అదే విధంగా కనుమ అంటే అందరికీ గుర్తొచ్చేది గారెలు. గారెలు, మాంసంతో ఈరోజు పెద్దలకి ప్రసాదం పెడతారు. అయితే ఈ పండగ నాడు ఎందుకు ప్రయాణాలు చెయ్యద్దు అని అంటారు..? శుభకార్యాలు ఎందుకు చేయరాదు అంటారు..? ఇక ఈ విషయం లోకి వస్తే… సాధారణంగా కనుమ పండుగ రోజు గారెలు చేసి నివేదనగా అర్పిస్తారు.
వాటిని పెద్దలకి ప్రసాదాలుగా పెట్టడం తరతరాలుగా వస్తున్న ఆచారం. అయితే కనుమ రోజు ఎందుకు ప్రయాణం చేయకూడదు అనేది చూస్తే.. ఆ రోజు ఎంతో శుభకార్యం. పెద్దలను తలచుకుని మనం కూడా కాస్త కృతజ్ఞతాపూర్వకంగా నడుచుకోవాలి.
అలాంటివి అన్నీ మర్చిపోయి మనం ప్రయాణం చేసి సరదాగా షికార్లు కొట్టడం అనేది సంస్కృతికి విరుద్ధం. అందుకనే కనుము నాడు ప్రయాణం చెయ్యొద్దన్నారు. పితృదేవతలకి ఆరోజు ప్రసాదాలు పెట్టి మధ్యాహ్నం సుష్టుగా భోజనం చేయడం మంచిది. అందుకని కనుమ నాడు ప్రయాణం చేయొద్దు అని చెప్తూ ఉంటారు పెద్దలు.