ఇదీ సంగ‌తి : కోడి పందేలు ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు మొదలయ్యాయి

-

సంక్రాంతి పండుగ అంటే గుర్తొచ్చేది కోళ్ల పందేలు. అది కూడా ఆంధ్రాలో ఎక్కువగా కోళ్ల పందేలు జరగడం మనం చూస్తుంటాం. అయితే ఈ కోడి పందేలు ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు మొదలయ్యాయి అనే విషయాలు మీకు తెలుసా? పందెం కోళ్ల గురించి మనకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కోళ్ల పందేలు అనేవి ఇప్పుడు ప్రారంభం అయినవి కావు.. దాదాపు 6000 ఏళ్ల క్రితమే ప్రారంభమయ్యాయి. వీటిని ప్రపంచ పురాతన పందేలు అంటారట. పందేల కోసం కోళ్లను పెంచే సంప్రదాయం ముందుగా పర్షియాలో ప్రారంభమయిందట. కోళ్ల పందేలు అనేవి పరువుకు సంబంధించినవి. అందుకే.. కోళ్ల పందేల కోసం ఉపయోగించే కోళ్లలో ప్రత్యేక జాతికి చెందినవే ఎక్కువగా ఉంటాయి. అమెరికన్ గేమ్ ఫౌల్, బర్మా రేజన్స్, జపనీస్ సామోస్, థాయిలాండ్ బాయ్‌క్వాసియామ్, పెరువియన్ నవ్‌జీరో, పాకిస్థాన్ రేజర్స్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అసీల్ కోడి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేలు జాతికి చెందిన పందెం కోళ్లు.

థాయిలాండ్, ఫిలిప్పీన్స్, బర్మా, ఇండోనేషియా, పెరు, చిలీ, బ్రెజిల్ లాంటి దేశాల్లో కోడి పందేలు చట్టబద్ధం చేయబడ్డాయి. అక్కడ పెద్ద పెద్ద స్టేడియాల్లో భారీగా కోడి పందేలను నిర్వహిస్తారు. వారి సంప్రదాయాలు, సంస్కృతిలో కోడి పందేలకు ప్రత్యేక స్థానం ఉంటుంది.

ఏపీకి చెందిన అసీల్ బ్రీడ్ ప్రత్యేకత ఇదే

ఏపీకి చెందిన అసీల్ బ్రీడ్ కోళ్లు చావుకు అస్సలు భయపడవు. రంగంలోకి దిగాయంటే అవి చంపడం లేదా చావడం అంతే. రక్తం వచ్చినా.. ఏది జరిగినా.. రెండు కోళ్లలో ఏదో ఒకటి చావాల్సిందే. అప్పటి వరకు అవి వెనుతిరగవు. అయితే.. వాటికి అలా పోరాడటానికి ట్రెయినింగ్ అంటూ ఏమీ ఉండదు. పోరాటం అనేది వాటి రక్తంలోనే ఉంటుంది. అందుకే ఆ జాతి కోళ్లను పందేల కోసం పెంచుతారు.

ఈ జాతి కోళ్లలో రెండు రకాల కోళ్లు ఉంటాయి. పందెం కోళ్లు, నాటు కోళ్లు. నాటు కోళ్లు పందేనికి పనిచేయవు. ఇవి ఎంత తిన్నా వాటి బరువు వెంటనే పెరగదు. పందెం కోళ్లలోనూ కొన్ని కోళ్లు పందేనికి పనికిరావట. అటువంటి వాటిని సంతానోత్పత్తికి ఉపయోగిస్తారట. పందేనికి పనికివచ్చే కోళ్లకు సపరేట్‌గా ట్రెయినింగ్ ఇస్తారు. వాటిని వాకింగ్‌కు తీసుకెళ్లడం, పౌష్టికాహారం ఇవ్వడం, స్విమ్మింగ్ చేయించడం, వ్యాయామం చేయించడం లాంటివి చేయిస్తారు. పందేలకు సంవత్సరం ముందు నుంచే కోళ్లకు శిక్షణ ప్రారంభం అవుతుంది. పూర్తిగా శిక్షణ పూర్తయ్యాక కోళ్లను పందేనికి దింపుతారు.

Read more RELATED
Recommended to you

Latest news