శ్రీరామనవమి స్పెషల్: పానకం, వడపప్పు ప్రసాదం ఇలా ఈజీగా చేసేయండి…!

శ్రీ రామ నవమి అంటే హిందువులకు ఎంతో ముఖ్యమైన రోజు. ఆ రోజున ఇళ్ళల్లో, దేవాలయాల్లో కూడా శ్రీ రామునికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకుని శ్రీరామునికి ప్రత్యేక పూజలు చేస్తారు, అయితే తప్పకుండా శ్రీరామ నవమి నాడు పానకం, వడపప్పు ప్రసాదంగా చేసే నైవేద్యం పెట్టి తీసుకోవాలి. అయితే ఈ రోజు మనం పానకం, వడపప్పు ప్రసాదం ఎలా ఈజీగా చేయాలో చూద్దాం…!

పానకం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:

మిరియాల పొడి మూడు టీ స్పూన్లు
చిటికెడు ఉప్పు
రెండు నుంచి మూడు కప్పుల బెల్లం
1 స్పూన్ సొంఠి పొడి
ఒక టీ స్పూన్ యాలుకలు పొడి
ఎనిమిది నుంచి తొమ్మిది కప్పుల నీళ్లు

పానకం తయారు చేసే విధానం:

దీనికోసం ముందుగా బెల్లాన్ని మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత నీళ్లలో బెల్లం వేసి అది కరిగిన తర్వాత వడకట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో మిరియాల పొడి, శొంఠి పొడి, ఉప్పు, యాలకుల పొడి కూడా వేసి బాగా కలపాలి. అంతే పానకం తయారీ అయిపోయింది.

వడపప్పు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు:

ఒక కప్పు పెసరపప్పు
ఒక పచ్చి మిర్చి
తగినంత ఉప్పు
కొబ్బరి తురుము (ఆప్షనల్)

వడపప్పు తయారు చేసుకునే విధానం:

దీనికోసం ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత 3 నుంచి 4 గంటల పాటు నీళ్లల్లో దానిని వేసి నానబెట్టాలి. ఇప్పుడు నీటిని పక్కకు తీసేసి పప్పు ని ఒక గిన్నెలో వేసి దానిలో పచ్చి మిర్చి, ఉప్పు వేసి కలపాలి. అంతే వడపప్పు తయారైపోయింది.