చాలా మంది అటుకులను వేయించి పోపు వేసుకుని తింటారు. కొందరు వీటిని టీలో వేసి తింటుంటారు. అయితే అటుకులతో పోహా (ఉప్మా) తయారు చేసుకుని తింటే ఎంత టేస్ట్‌గా ఉంటుందో తెలుసా..? అటుకల పోహా రుచికే కాదు, మనకు ఆరోగ్యకర ప్రయోజనాలను అందించడంలోనూ మేటి అని చెప్పవచ్చు. మరి అటుకుల పోహా ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
అటుకుల పోహా తయారీకి కావల్సిన పదార్థాలు :
అటుకులు- 1 కప్పు
పచ్చిమిర్చి- 3
పెద్ద ఉల్లిపాయ – సగం
వేరుశెనగలు (పల్లీలు) – 2 టేబుల్ స్పూన్లు
పచ్చి బఠాణీలు – 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు – తగినంత
జీలకర్ర – అర టీస్పూన్
వెల్లుల్లి ముక్కలు – అర టీస్పూన్
పసుపు – 1/4 టీస్పూన్
కొత్తిమీర – తగినంత
కరివేపాకు – 2 రెమ్మలు
నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు
అటుకుల పోహా తయారు చేసే విధానం:
ముందుగా అటుకులను నీరు పోసి శుభ్రంగా కడగాలి. అనంతరం వాటి నుంచి నీటిని పూర్తిగా పిండి అటుకులను పక్కన పెట్టాలి. పాన్ తీసుకుని నూనె కొద్దిగా వేసి వేడి చేయాలి. జీలకర్ర, పల్లీలు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చి బఠానీలు వేసి మరో 5 నిమిషాలు బాగా వేయించాలి. తర్వాత అటుకులు వేసి బాగా కలపాలి. చివర్లో ఉప్పు, నిమ్మరసం వేసి మరోసారి కలియబెట్టాలి. అనంతరం పోహాను కొత్తిమీరతో అలంకరించాలి. అంతే.. ఘుమ ఘుమలాడే వేడి వేడి అటుకుల పోహా తయారవుతుంది. అయితే పోహాలో పోషకాలు ఇంకా ఎక్కువ లభించాలంటే.. క్యారెట్, క్యాప్సికం తదితర కూరగాయ ముక్కలను కూడా వేసుకోవచ్చు..!