బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చక్కని పండు. ఏ సీజన్‌లో అయినా ఇది మనకు దొరుకుతుంది. సమ్మర్‌లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. మీరు ఒక్క బొప్పాయి పండు కోసినా అందులో బోలెడు గింజలు ఉంటాయి.. మనం వాటిని పక్కన పడేస్తాం కదా.. కానీ ఈ విత్తనాలలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈరోజు మనం ఈ గింజల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..!
పరగడుపున ఈ గింజల నీరు తాగితే అధిక బరువుని తగ్గించుకోవచ్చు. జలుబు, ఫ్లూ నివారణ బొప్పాయి గింజలలోని పాలీఫెనాల్స్, ఫ్లేవలోయిడ్స్ వంటి యాంటీ-ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఇవి ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జలుబు వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది.
బొప్పాయి గింజలలో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ధమనులలో ప్లేక్ తగ్గినప్పుడు రక్తపోటు తగ్గుతుంది. వీటితో గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాల వ్యాధి వంటి గుండె జబ్బులను నివారించవచ్చు.
బొప్పాయి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ బాగుంటే స్థూలకాయానికి గురికాకుండా పెరుగుతున్న బరువు కూడా తగ్గించుకోవచ్చు.
బొప్పాయి గింజలను ఎలా తినాలి ..?
అంతా బానే ఉంది కానీ.. అసలు వాటిని ఎలా తినాలి.. అవి చూసేందుకు నల్లగా, జిగటగా ఉంటాయి. ఇక వాటి టేస్ట్ ఎలా ఉంటుందో అనుకుంటున్నారా..? ఈ విత్తనాలను నీటితో కడగాలి. ఆపై వాటిని ఎండలో ఆరబెట్టాలి. అవి పూర్తిగా ఎండిపోయిన తర్వాత గ్రైండ్ చేసి పొడిని గాలిచొరబడని డబ్బాలో వేసి స్టోర్ చేసుకోండి. ఈ పొడిని వివిధ రకాల ఆహారపదార్థాలలో కలుపుకొని తినవచ్చు. దీని రుచి చేదుగా ఉంటుంది కాబట్టి తీపి పదార్థాలతో కలిపి తినడం మంచిది.
ఈ విధంగా బొప్పాయి గింజలను వాడిచూడండి.. మంచి రిజల్ట్ ఉంటుంది. ఆ గింజలను ఎండబెట్టి పొడి చేసేంత టైమ్, ఓపిక లేవంటే.. డైరెక్టుగా ఆన్‌లైన్ మార్కెట్‌లో వాటిని కొనుగోలు చేయొచ్చు. బొప్పాయి గింజల పొడి మనకు ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంలో అందుబాటులో ఉంది. లేదా డైరెక్టుగా బొప్పాయి సీడ్స్ తినొచ్చు. పండుకోసినప్పుడు వచ్చే ఆ గింజలను రోజుకు ఒక స్పూన్ మోతాదులో తినొచ్చు. స్కిన్‌కు చాలా మంచిది. మరీ ఎక్కువగా తింటే వాంతులు అయ్యే ప్రమాదం ఉంది.