కోడిగుడ్లతో చేసే ఏ వంటకాన్నయినా.. ఎవరైనా ఇష్టంగానే తింటారు. అయితే వాటని బోండాలుగా వేసుకుని తినేవారు చాలా తక్కువగానే ఉంటారు. నిజానికి కాసింత శ్రమ పడి ఎగ్‌బొండాలను చేయాలే కానీ వాటి రుచి అదిరిపోయేలా ఉంటుంది. ఎగ్ బొండాలను చిన్నారులకు పెడితే వారికి రుచికి రుచి, పోషకాలకు పోషకాలు లభిస్తాయి. మరి ఎగ్ బొండాలను తయారు చేసేందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో, వాటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఎగ్ బొండా తయారీకి కావల్సిన పదార్థాలు:
కోడిగుడ్లు (ఉడకబెట్టినవి) – 3
నూనె – 1 కప్పు
బియ్యపు పిండి – అర కప్పు
కారం – అర టీస్పూన్
మిరియాల పొడి – కొద్దిగా
పచ్చిమిరప కాయలు – 2
శనగపిండి – 1 కప్పు
ఉప్పు – తగినంత
ఎగ్ బొండా తయారు చేసే విధానం:
ఉడికబెట్టిన గుడ్లను ముక్కలుగా చేయాలి. వాటిపై కారం, మిరియాల పొడి, ఉప్పు సరిపోయినంత చల్లుకోవాలి. పాన్ తీసుకుని అందులో నూనె వేసి సన్నని మంటపై వేడి చేయాలి. ఒక పాత్ర తీసుకుని.. అందులో శనగపిండి, బియ్యపు పిండి, కారం, పచ్చిమిరపకాయ ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు వేసి, నీళ్లు పోసి బొండాలకు సరిపడేలా పిండిని తయారు చేయాలి. పిండి చిక్కగా ఉండాలి. నూనె వేడి అయ్యాక ఉడికిన కోడిగుడ్డు ముక్కలను అంతకు ముందు రెడీ చేసి పెట్టుకున్న పిండిలో ముంచి నూనెలో వేయాలి. బంగారు రంగు వచ్చే వరకు ముక్కలను వేయించాలి. దీంతో వేడి వేడి ఎగ్ బొండాలు తయారవుతాయి. వాటిని టమాటా సాస్ లేదా పుదీనా చట్నీతో కలిపి తింటే.. ఆహా.. ఆ రుచే వేరేగా ఉంటుంది. తిన్నారంటే మైమరిచిపోవాల్సిందే. అంత కమ్మగా ఎగ్ బొండాలు ఉంటాయి..!