రుచిక‌ర‌మైన ట‌మాటా పులిహోర‌.. చేసేద్దామా..!

-

చింత‌పండుతో పులిహోర‌, నిమ్మ‌కాయ‌ల‌తో లెమ‌న్ రైస్ చేసుకుని తిన‌డం మ‌న‌కు బాగా అల‌వాటే. అవి రెండూ మ‌న‌కు చ‌క్క‌ని రుచిని అందిస్తాయి. అయితే ట‌మాటాల‌తో కూడా పులిహోర చేసుకుని తిన‌వ‌చ్చు. కొద్దిగా శ్ర‌మ‌ప‌డాలే గానీ రుచిక‌ర‌మైన ట‌మాటా పులిహోర మ‌న జిహ్వ చాప‌ల్యాన్ని తీరుస్తుంది. అలాగే ఆక‌లి మంట కూడా చ‌ల్లారుతుంది. దీన్ని అల్పాహారంగా తీసుకోవ‌చ్చు, లేదా మధ్యాహ్న భోజ‌నం రూపంలోనూ తీసుకోవ‌చ్చు. మ‌రి ట‌మాటా పులిహోర‌ను ఎలా త‌యారు చేయాలో, అందుకు ఏమేం ప‌దార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

ట‌మాటా పులిహోర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:

బియ్యం – 1/4 కిలో
ట‌మాటాలు – 1/4 కిలో
చింతపండు గుజ్జు – 1 టేబుల్ స్పూన్‌
ప‌చ్చిమిర్చి – 6
ఇంగువ – చిటికెడు
ప‌ల్లీలు – 3 టేబుల్ స్పూన్లు
శ‌న‌గ‌ప‌ప్పు – 2 టేబుల్ స్పూన్లు
మిన‌ప పప్పు – 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు – త‌గినంత
ఎండు మిర‌ప‌కాయ‌లు – 4
ఆవాలు – 1 టీస్పూన్
నూనె – 100 ఎంఎల్
క‌రివేపాకు – 4 రెబ్బ‌లు
ప‌సుపు – 1 టీస్పూన్

ట‌మాటా పులిహోర త‌యారు చేసే విధానం:

ట‌మాటాలు, ప‌చ్చిమిర‌ప‌కాయ‌ల‌ను ముక్క‌లుగా కోసుకుని ఉడ‌క‌బెట్టాలి. చ‌ల్లారాక చింత‌పండు గుజ్జు క‌లిపి మెత్తగా రుబ్బుకోవాలి. అన్నం ఉడికించి ప‌క్క‌న పెట్టుకోవాలి. వెడ‌ల్పుగా ఉన్న క‌ళాయి తీసుకుని అందులో ఉడికించిన అన్నం, ట‌మాటా గుజ్జు మిశ్ర‌మాన్ని వేసి బాగా క‌లిపి ప‌క్క‌న పెట్టాలి. అనంత‌రం మ‌రో క‌ళాయిలో నూనె పోసి వేడెక్కాక ప‌ల్లీలు, మిన‌ప పప్పు, ఆవాలు, ఇంగువ, ఎండు మిర‌ప‌కాయ‌లు, ప‌సుపు వేసి బాగా వేపుకోవాలి. అనంతం క‌రివేపాకు కూడా వేసి బాగా వేగాక మొత్తం తాళింపును ట‌మాటా గుజ్జు క‌లిపిన అన్నంలో వేసి బాగా క‌ల‌పాలి. అంతే.. రుచిక‌ర‌మైన ట‌మాటా పులిహోర త‌యార‌వుతుంది..!

Read more RELATED
Recommended to you

Latest news