ఈ కాలం లో పిల్లలు మొబైల్ ఫోన్లకు బానిసలు అవుతున్నారు ఎక్కువ సమయం స్క్రీన్ ముందు గడపడం వల్ల వారి ఆరోగ్యం, చదువు దెబ్బతింటున్నాయి. పిల్లలను మొబైల్ వాడకం నుంచి దూరం చేయడానికి తల్లులు ఎంతగానో శ్రమించాల్సి వస్తుంది అటువంటి వారి కోసం ఈ చిన్న చిట్కాలను తెలుసుకోవడం ముఖ్యం.. మరి వాటి గురించి చూద్దాం..
సమయం పరిమితి నిర్ణయించడం : పిల్లలకు మొబైల్ వాడటానికి, స్పష్టమైన సమయపరిమితి నిర్ణయించాలి. రోజుకు గంట మాత్రమే స్క్రీన్ టైం ఇవ్వండి. ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేయాలి. ఉదాహరణకు చదువు, ఆటలు, నిద్ర సమయాల్లో మొబైల్ ని పూర్తిగా నిషేధించాలి. టైమర్ లేదా యాప్ ల ద్వారా ఎంత సేపు వాళ్లు మొబైల్ చూస్తున్నారన్నది తెలుసుకోవచ్చు ఇది పిల్లలకు క్రమశిక్షణ నేర్పుతుంది.
ఇతర పనులను ప్రోత్సహించడం: మొబైల్ కి బదులుగా పిల్లలు ఆసక్తిగా చేసే ఏ పనినైనా ప్రోత్సహించడం చేయండి. బయట ఆటలు, చదువు, డ్రాయింగ్, సంగీతం, కథల పుస్తకాలు చదవడం వంటి వాటిని ప్రోత్సహించాలి. సాయంత్రం కుటుంబంతో కలిసి కాసేపు సరదాగా నడవడం, లేదా సైకిల్ నేర్చుకోవడం వంటివి చేయడం ద్వారా శారీరకంగానే కాక మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.
రోల్ మోడల్ గా ఉండడం: పిల్లలు తల్లిదండ్రులను ఎక్కువగా అనుకరిస్తారు. వారు ఏది చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారు. వారికి మీరు రోల్ మోడల్ లా నిలవాలి అంటే ముందుగా మీరు మారాలి. అందుకే మీరు ఎక్కువ సమయం మొబైల్లో గడిపితే వారు కూడ అదే చేస్తారు, అందుకే పిల్లల ముందు మొబైల్ వాడకాన్ని తగ్గించండి. బదులుగా వారితో కలిసి ఆటలాడడం, కథలు చెప్పడం లేదా ఇంటి పనుల్లో భాగం చేయండి.
బహుమతులు ఇవ్వడం: ఇంట్లో పిల్లలు మొబైల్ వాడకాన్ని తగ్గించినప్పుడు వారిని ప్రోత్సహించడానికి చిన్న చిన్న బహుమతులు ఇవ్వండి. ఉదాహరణకి ఒక వారం రోజులు మొబైల్ వాడకుండా ఉంటే మీకు ఇష్టమైన పుస్తకం కొనిస్తానని లేదా ఏదైనా బొమ్మ కొనిస్తానని పార్కుకి తీసుకెళ్తానని ఇలా ఏదైనా సరే వారికి నచ్చేదాన్ని బహుమతిగా ఇవ్వండి. ఈ బహుమతులు వారిని ఎంతో ఎంకరేజ్ చేస్తాయి.
మొబైల్ ఫ్రీ జోన్స్: మన ఇంట్లో కొన్నిప్లేస్ లను మొబైల్ ఫ్రీ జోన్స్ గా నిర్ణయించండి. ఉదాహరణకు భోజనం సమయంలో డైనింగ్ టేబుల్ దెగ్గర, పడకగదిలో, కుటుంబమంతా కలిసి కూర్చునే టైం లో, మొబైల్ ఉండకూడదని పిల్లలకు చెప్పండి. ఈ టైంలో కుటుంబ సభ్యులతో గడపడం వారితో మాట్లాడటం చేయండి. ఇది పిల్లలకు సామాజిక నైపుణ్యాన్ని పెంచుతుంది.
పిల్లలు మొబైల్ వాడకం నుండి దూరం చేయడానికి తల్లులకు ఎంతో సవాళ్లుగా ఉన్నప్పటికీ పై చిట్కాలను పాటిస్తే సులభంగా సాధ్యమవుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.