పరీక్షల టైంలో, ఆఫీసులో పని ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా ఏదైనా ప్రయాణంలో మేల్కొని ఉండాలంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కాఫీ. దీనిలో ఉండే కెఫిన్ మన నిద్రను పారద్రోలి, మనల్ని యాక్టివ్‌గా ఉంచుతుందని మనందరికీ తెలుసు. అయితే కొందరు మాత్రం కాఫీ తాగినా కూడా నిద్ర వస్తుంది అని చెప్పడం వింతగా అనిపించవచ్చు. అసలు కాఫీ తాగితే ఎందుకు నిద్ర రాదు? కొందరికి మాత్రం ఎందుకు నిద్ర వస్తుంది? దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి? తెలుసుకుందాం.
కెఫిన్ ఎలా పనిచేస్తుంది: కెఫిన్ అనేది ఒక ఉద్దీపన. ఇది మన మెదడులోని ఎడినోసిన్ అనే ఒక న్యూరోట్రాన్స్‌మిటర్ పనితీరును అడ్డుకుంటుంది. ఎడినోసిన్ మన మెదడుకు “నిద్ర రావడానికి సిద్ధంగా ఉండు” అనే సంకేతాలను పంపుతుంది. కెఫిన్, ఎడినోసిన్ రిసెప్టర్లకు జతకట్టి దాని పనితీరును అడ్డుకుంటుంది. దీని వల్ల మెదడుకు నిద్ర సంకేతాలు అందవు, తద్వారా మనం చురుకుగా ఉంటాం. ఒక కప్పు కాఫీ తాగిన 15-45 నిమిషాల్లో దాని ప్రభావం మొదలవుతుంది. కొన్ని కారణాల వల్ల కాఫీ తాగినా కూడా కొందరికి నిద్ర వస్తుంది.

కొందరికి మాత్రం నిద్ర ఎందుకు వస్తుంది: క్రమం తప్పకుండా కాఫీ తాగే వారికి శరీరం కెఫిన్‌కు అలవాటు పడుతుంది. దీనివల్ల కెఫిన్ ప్రభావం తగ్గుతుంది. ఎంత కాఫీ తాగినా ఆశించిన ఫలితం ఉండదు. కొందరిలో జన్యుపరంగా కెఫిన్‌ను జీర్ణం చేసుకునే ఎంజైమ్ పనితీరు వేగంగా ఉంటుంది. దీనివల్ల కెఫిన్ త్వరగా విచ్ఛిన్నం అవుతుంది దాని ప్రభావం ఉండదు. కాఫీ డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. డీహైడ్రేషన్ వల్ల కూడా మనం అలసటగా నిద్రగా ఫీల్ అవుతాం. మీరు కాఫీలో చక్కెర ఎక్కువగా కలుపుకుంటే ముందుగా మీరు చురుకుగా ఉంటారు. ఆ తర్వాత రక్తంలోని చక్కెర స్థాయిలు పడిపోయి, అలసట, నిద్ర వస్తాయి. ఒకవేళ మీ శరీరం చాలా అలసిపోయి ఉంటే ఒక కప్పు కాఫీ తాగినా కూడా నిద్ర వస్తుంది.
కాఫీ, నిద్రకు మధ్య ఉన్న సంబంధం చాలా క్లిష్టమైనది. ఇది వ్యక్తిగతమైనది. కెఫిన్‌కు మన శరీరం ఎలా స్పందిస్తుందో, మన అలవాట్లు మన జన్యువులు, ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. కాఫీ తాగినా నిద్ర వస్తే దానికి కారణం మీ శరీరం అలసిపోవడం కెఫిన్‌కు అలవాటు పడటం వంటివి కావచ్చు.
గమనిక :పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీకు నిద్ర లేదా అలసట సమస్యలు ఉంటే, వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం