ఏమండోయ్‌ ఇది విన్నారా..? స్మోకింగ్‌ చేస్తే ఇక వినడానికి ఏం ఉండదట..!

-

పొగతాగితే ఊపిరితిత్తులు పాడవుతాయని విని ఉంటారు. కానీ స్మోకింగ్ వల్ల చెవులు కూడా పోతాయని మీరు అసలు అనుకున్నారా..? ఏదో టెన్షన్‌లో దమ్ముకొడతాం.. అంత మాత్రానికే చెవులు పోతాయా అంటారేమో.. మీరు టెన్షన్‌లో ఒకసారి, తలనొప్పికి ఒకసారి, అసలు ఏం పని లేకపోయినా బోర్‌ కొట్టి ఒకసారి ఎలా పడితే అలా రోజుకు ప్యాకెట్లు ప్యాకెట్లు కాల్చేస్తే అక్కడ చెవులు కూడా ప్యాకింగ్‌ చేసుకుని షెడ్డుకు వెళ్లిపోతాయంటున్నారు వైద్యులు. ఈ విషయాన్ని తాజా పరిశోధనలో గుర్తించారట.!

ధూమపానం (Smoking) కాలక్రమేణా తీవ్ర శారీరక, మానసిక అనారోగ్యాలకు దారి తీస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి శారీరక అనారోగ్యాలతో పాటు డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మానసిక అనారోగ్యాలకు కూడా ధూమపానం కారణమవుతుంది. అయితే స్మోకింగ్ హ్యాబిట్.. వినే సామర్థ్యాన్ని (Hearing) కూడా దెబ్బతీస్తుందని ఇటీవల కాలంలో పరిశోధకులు గుర్తించారు. ధూమపానం, వినికిడి లోపం మధ్య లింక్ ఉందని చెప్పడానికి ఆధారాలు కూడా చూపించారు.

శాస్త్రవేత్తలు ఇప్పటికే పలు పరిశోధనలు చేసి, పొగ తాగేవారికి వయసు పెరిగే కొద్దీ వినికిడి సమస్య ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు. 2018లో చేసిన ఒక అధ్యయనంలో ధూమపానం చేయని వ్యక్తులతో పోలిస్తే ధూమపానం చేసేవారికి వినికిడి సమస్యలు వచ్చే ముప్పు దాదాపు రెండింతలు పెరిగిందని తేలింది. ఒక వ్యక్తి రోజూ ఎక్కువ సిగరెట్లు, ఎక్కువసార్లు తాగితే వినికిడి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని కూడా గుర్తించారు.

స్మోకింగ్ పెద్దలు, పిల్లలు ఎవరికీ మంచిది కాదు. ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా ఈ అలవాటు వినడానికి తోడ్పడే శరీర భాగాలకు హాని చేస్తుంది. గొంతు, నాసికా కణజాలంపై ప్రతికూల ప్రభావం చూపుతూ స్మోకర్ల రోగనిరోధక శక్తిని కూడా బలహీనపరుస్తుంది. తద్వారా వారు అనారోగ్యానికి, చెవి ఇన్ఫెక్షన్లకు గురయ్యే ముప్పు పెరుగుతుంది.

ఇతరులు పొగ తాగేటప్పుడు వారి పక్కనే ఉండే పిల్లలు సైతం మరింత ప్రభావితమవుతారు. అందులో ఇంట్లో ఎవరికైనా పొగ తాగే అలవాటు ఉంటే వాళ్లు ఎలాగూ ఆ పాడు అలవాటు మానరు కనీసం అది ఇంట్లో తాగకుండా అని మీరు చేయగలగండి. లేకపోతే వారితో పాటు మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. వినికిడి సమస్య ఉన్న స్మోకర్లలో 77.5% మంది సెన్సోరినిరల్ (Sensorineural) అని పిలిచే ఒక రకమైన వినికిడి సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. 18.3% మందికి మిక్స్డ్ టైప్ ఇయర్ ప్రాబ్లమ్ (Mixed type ear problem) ఉంటుంది. ధూమపానం చేయని వ్యక్తులలోనే ఈ మిశ్రమ రకం ఎక్కువగా ఉంటుంది.

ధూమపానం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థపై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. ముఖ్యంగా చెవిలోని కోక్లియా (Cochlea) అనే భాగానికి వేగంగా, సక్రమంగా రక్తం ప్రసరించదు. దీనివల్ల ఆ భాగం దెబ్బతింటుంది. కోక్లియా అనేది వినికిడి శక్తిని అందించే ఒక కీలకమైన భాగం కాబట్టి అది దెబ్బతింటే వినికిడి సమస్య తలెత్తే ప్రమాదం పెరుగుతుంది.ఇక సిగరెట్‌లోని నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికరమైన పదార్థాలు మెదడుకు సంకేతాలను పంపే చెవుల్లోని చిన్న జుట్టు కణాలను కూడా ప్రభావితం చేస్తాయి. ఫలితంగా చెవులు వేగంగా వినికిడి శక్తిని కోల్పోతాయి. చెవుల సామర్థ్యం ముసలి వారి లాగా మారిపోతుంది. దీంతో చిన్న వయస్సులోనే వినికిడి సమస్యలు వేధిస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version