ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకున్నా లేదా ప్రోటీన్ షేక్‌లను తాగినా.. వాటిల్లో ఉండే ప్రోటీన్లను సంశ్లేషణం చేసేందుకు కిడ్నీలు శ్రమించాల్సి వస్తుంది. దీంతో కిడ్నీల పనితీరు మందగిస్తుంది.
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని మనందరికీ తెలిసిందే. అయితే పోషకాల విషయానికి వస్తే మనం నిత్యం కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు సమపాళ్లలో తీసుకోవాలి. ముఖ్యంగా శరీర నిర్మాణం జరగాలన్నా, కొత్త కణాలు ఏర్పడాలన్నా, కండరాలు దృఢంగా ఉండాలన్నా.. ప్రోటీన్లు తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే ప్రస్తుత తరుణంలో చాలా మంది బరువు తగ్గాలన్న నెపంతో ప్రోటీన్లతో కూడిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా వారు ప్రోటీన్ షేక్స్‌ను ఎక్కువగా తాగుతున్నారు..? అయితే నిజానికి ఇలా ప్రోటీన్లను అధికంగా తీసుకోవడం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
నిత్యం ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే మన కిడ్నీలపై అధిక భారం పడుతుందట. సాధారణ సమయాల్లోనే మన శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను వడబోసేందుకు కిడ్నీలు ఎక్కువగా శ్రమిస్తాయి. అదే ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారం అయితే కిడ్నీలపై మరింత భారం పడుతుంది. దీంతో కిడ్నీల పనితీరు కాలక్రమేణా తగ్గుతుంది. ఫలితంగా కిడ్నీ వ్యాధుల బారిన పడతారు.
కిడ్నీ వ్యాధులు ఉన్నవారు అయితే ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారాలను అస్సలు తీసుకోరాదు. లేదంటే మొదటికే మోసం వస్తుంది. కిడ్నీలు ఫెయిలయ్యేందుకు అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మన శరీర బరువు ఒక కిలోకు ఒక గ్రాము ప్రోటీన్లు అవసరం అవుతాయి. కనుక ప్రతి ఒక్కరు తమ శరీర బరువుకు అనుగుణంగానే ప్రోటీన్లను తీసుకోవాలి. అంతేకానీ.. బరువు తగ్గుతామని ప్రోటీన్లను అధికంగా తీసుకుంటే తిప్పలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దాంతో ప్రస్తుతానికి ఇబ్బందులు ఏమీ లేకపోయినా.. భవిష్యత్తులో మాత్రం తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని వారు అంటున్నారు.
ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకున్నా లేదా ప్రోటీన్ షేక్‌లను తాగినా.. వాటిల్లో ఉండే ప్రోటీన్లను సంశ్లేషణం చేసేందుకు కిడ్నీలు శ్రమించాల్సి వస్తుంది. దీంతో కిడ్నీల పనితీరు మందగిస్తుంది. ఈ క్రమంలో వడబోత ప్రక్రియ సజావుగా సాగదు. దీని వల్ల బలహీనత, వికారం వంటి సమస్యలు వస్తాయి. కనుక ప్రోటీన్లను మనకు ఎంత అవసరమో అంతే మోతాదులో తీసుకోవాలి. అధికంగా వాడాల్సి వస్తే డాక్టర్ సూచన మేరకు వాడుకోవాలి. ఇక మనకు చికెన్, గుడ్లు, చేపలు, పాలు, పాల సంబంధ పదార్థాలు, చిక్కుడు జాతి గింజలు, నట్స్‌లో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. కనుక ఈ ఆహారాలను నిత్యం తీసుకుంటే చాలు, ప్రోటీన్ల లోపం రాకుండా చూసుకోవచ్చు..!