కిడ్నీ వ్యాధిగ్ర‌స్తులు కాఫీ ఎక్కువ‌గా తాగితే మంచిద‌ట‌..!

కిడ్నీ వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారు నిత్యం కాఫీని తాగుతుంటే వారు చ‌నిపోయే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేర‌కు నెఫ్రాల‌జీ డ‌యాల‌సిస్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ అనే జ‌ర్న‌ల్‌లో ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించారు. అందులో ప‌లువురు సైంటిస్టులు కాఫీ, కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల‌పై ప్ర‌భావం అనే అంశంపై ప‌రిశోధ‌న చేశారు. మొత్తం 4863 మందిని ప‌రిశీలించి ప‌రీక్ష‌లు చేయ‌గా ఈ విష‌యం తెలిసింది. తీవ్ర‌మైన కిడ్నీ వ్యాధులతో బాధ‌ప‌డే వారు కాఫీని తాగితే అందులో ఉండే కెఫీన్ శ‌రీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను విడుద‌ల చేస్తుంద‌ట‌. ఇది కిడ్నీల ప‌నితీరును కొంత వ‌ర‌కు సరిచేస్తుంద‌ట‌. అందువ‌ల్ల కిడ్నీ వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారు నిత్యం కాఫీని తాగితే మంచి ఫ‌లితం ఉంటుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

అలాగే కిడ్నీ వ్యాధిగ్ర‌స్తులు కాఫీని ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల వారు ఆ వ్యాధుల‌తో చ‌నిపోయే అవ‌కాశాలు కూడా 25 శాతం వ‌ర‌కు త‌గ్గుతాయట‌. అంటే ఆ మేర జీవ‌న కాలం పెరుగుతుంద‌ని అర్థం. ఇక కాఫీ తాగ‌డం వ‌ల్ల ప‌లు ఇత‌ర లాభాలు కూడా ఉంటాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

కాఫీని రోజూ తాగ‌డం అల‌వాటు చేసుకుంటే ప‌లు వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. శ‌రీరంలో నొప్పులు, వాపుల‌ను త‌గ్గించే గుణం కాఫీలోని కెఫీన్‌కు ఉంటుందట‌. కాఫీని తాగ‌డం వల్ల హైబీపీ త‌గ్గుతుంద‌ని, ర‌క్త నాళాలు మృదువుగా మారి, చ‌క్క‌గా ప‌నిచేస్తాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. కాఫీ తాగడం వ‌ల్ల మెద‌డు కూడా యాక్టివ్‌గా మారుతుంద‌ట‌. ఎన్‌సీబీఐ ప‌రిశోధ‌కులు చెబుతున్న వివ‌రాల ప్ర‌కారం.. నిత్యం 3 క‌ప్పు కాఫీ తాగితే 65 శాతం వ‌ర‌కు మ‌తిమ‌రుపు వ‌చ్చే అవ‌కాశం త‌గ్గుతుంద‌ట‌.

కాఫీని రోజూ తాగడం వ‌ల్ల టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయ‌ని కూడా ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. అధిక బ‌రువును త‌గ్గించ‌డంలోనూ కాఫీ మెరుగ్గా ప‌నిచేస్తుంద‌ని వారు అంటున్నారు. క‌నుక ఇంకెందుకాల‌స్యం.. వెంట‌నే వేడి వేడిగా ఒక క‌ప్పు కాఫీ లాగించేయండి మ‌రి..!