కళ్లు మనకు ప్రపంచాన్ని చూపిస్తాయి. కళ్లు లేకపోతే ఆ జీవితం ఎలా ఉంటుందో అది అనుభవించే వారికి తప్ప ఇతరులకు ఆ సమస్య గురించి తెలియదు. అందుకని ప్రతి ఒక్కరు తమ కంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. కంటి సంరక్షణకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అయితే ప్రస్తుత తరుణంలో అనేక మంది కంటి సమస్యల బారిన పడుతున్నారు. కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ తెరలను గంటల తరబడి రెప్ప వేయకుండా వీక్షిస్తుండడం, రాత్రి పూట అధిక సమయం పాటు మేల్కొనడం, పౌష్టికాహార లోపం వల్ల నేత్ర సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. దీనికి తోడు చాలా మందిలో కంటి చూపు సమస్యగా మారుతోంది. అయితే కింద సూచించిన విధంగా పలు ఆహారాలను నిత్యం తీసుకుంటే దాంతో కంటి సమస్యల నుంచి బయట పడడమే కాదు, కంటి చూపు కూడా మెరుగు పడుతుంది.
1. క్యారెట్లు
క్యారెట్లలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. నిత్యం క్యారెట్లను తింటుంటే విటమిన్ ఎ బాగా లభిస్తుంది కాబట్టి కంటి సమస్యలు ఉండవు. నేత్ర దృష్టి కూడా బాగా పెరుగుతుంది. అలాగే విటమిన్ బి, కె, సిలతోపాటు ఫైబర్, మెగ్నిషియంలు కూడా ఉంటాయి కనుక మన శరీరానికి చక్కని పోషణ లభిస్తుంది.
2. యాప్రికాట్స్
మనకు మార్కెట్‌లో ఇవి ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ రూపంలో లభిస్తాయి. వీటిల్లోనూ విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల మన కళ్లకు చక్కని సంరక్షణ లభిస్తుంది. కంటి చూపు మెరుగు పడుతుంది.
3. పాలకూర
పాలకూరలోనూ విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది నేత్రాల ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. నిత్యం పాలకూరను తింటే కళ్లను సురక్షితంగా ఉంచుకోవచ్చు.
4. బొప్పాయి
బొప్పాయి పండ్లలో విటమిన్ ఎ మనకు కావల్సినంత లభిస్తుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరిచి కంటి చూపును పెంచుతుంది. తరచూ బొప్పాయి పండ్లను తింటే కంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
5. ఎరుపు క్యాప్సికం
ఎరుపు రంగులో ఉండే క్యాప్సికంను తింటున్నా కంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. వీటిల్లో ఉండే విటమిన్ ఎ, లైకోపీన్‌లు కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరిచి కంటి చూపును పెంచుతాయి.