ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలంటే రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేయాలి. సహజంగా పిల్లలలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దాని వలన ఎంతో త్వరగా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా అలసిపోవడం, ఆకలి వేయకపోవడం, జలుబు, జ్వరం వంటి మొదలైన సమస్యలు తలెత్తుతాయి. రోగనిరోధక శక్తిని పెంచాలంటే మీ పిల్లల రోజువారి ఆహారంలో కొన్ని మార్పులను చేసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు తరచుగా రావడం వలన ఆరోగ్యం పై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కనుక రోగనిరోధక శక్తి పెరిగి బలంగా ఉండాలంటే మంచి పోషక విలువలు ఉండేటువంటి ఆహారాన్ని తప్పకుండా ఇవ్వాలి.
పిల్లలలో రోగనిరోధక శక్తి పెరగాలంటే విటమిన్ ఎ, సి, డి, ఈ, ప్రోటీన్, జింక్, ఐరన్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండేటువంటి ఆహార పదార్థాలను ఇవ్వాలి. ముఖ్యంగా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు, గింజలు, పెరుగు, పాలు వంటివి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయం చేస్తాయి. కేవలం ఆహారం మాత్రమే కాకుండా పిల్లలకు నిద్ర కూడా సరిగా ఉండాలి. దాంతో ఎన్నో సమస్యలు రాకుండా ఉంటాయి. అందువలన నిద్ర కూడా పిల్లలకి ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పవచ్చు. పిల్లల వయసు ప్రకారం తగినంత నిద్ర ఎంతో అవసరం. 2 నుండి 5 సంవత్సరాల పిల్లలు 10 నుండి 13 గంటల వరకు నిద్రపోవాలి. అంతే కాకుండా 6 నుండి 13 సంవత్సరాల వయస్సు వారు అయితే 9 నుండి 11 గంటల వరకు నిద్రపోవచ్చు.
కనుక సరైన నిద్ర ఉండే విధంగా చూడాలి. సహజంగా పిల్లలు మంచి నీరుని తాగడానికి ఇష్టపడరు. కనుక తగినంత నీరు తాగే విధంగా చూడాలి. అంతేకాకుండా పండ్ల రసాలను కూడా ఇవ్వడం వలన ఎంతో హైడ్రేటెడ్ గా ఉంటారు. చిన్నవారి నుండి పెద్దవారి వరకు శారీరిక శ్రమ కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరం. కేవలం ఫిట్నెస్ కోసం మాత్రమే కాకుండా ఆటలు ఆడటం, యోగా, రన్నింగ్ వంటివి చేయడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సహజంగా పిల్లలు శుభ్రతను ఎక్కువగా పాటించరు. కనుక క్రమంగా చేతులు కడుక్కోవడం, పరిశుభ్రంగా ఉండడం వంటివి అలవాటు చేయాలి. ఇలా చేస్తే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది.