15 రకాల వైద్య పరీక్షలు కేవలం రూ. 50 కే అంటే ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది నిజం. కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసిన హెల్త్‌కియోస్క్ లు ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరం గా ఉన్నాయి. కేవలం రూ.50 కే 15 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులకు ప్రత్యేకంగా ఆరోగ్య సేవలు అందజేసేందుకు.. ఎలాంటి లాభాపేక్షా లేకుండా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక ఇక్కడ పలు రకాల వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. మరో విశేషం ఏంటంటే పరీక్షల ఫలితాలను కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే అందిస్తారు.
సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై వీటిని అందుబాటులో ఉంచారు. రక్తపోటు, షుగర్, శరీరంలో కొలెస్ట్రాల్, ప్రొటీన్ స్థాయి, బోన్‌మారో తదితర పరీక్షలను నిర్వహిస్తు అవగాహన కల్పిస్తుంది. ముఖ్యంగా నిద్రలేమి, అలసట తదితర సమస్యలతో బాధపడేవారు ప్రయాణ సమయంలో తమ ఆరోగ్యస్థితిని తెలుసుకొనేందుకు ఈ కియోస్క్‌లు దోహదం చేస్తాయి. ఈ సేవలు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.
కొత్తగా సికింద్రాబాద్ స్టేషన్ల ప్రయాణికులకు హెల్త్ కియోస్క్ సేవలను అందుబాటులోకి తేవడంతో ప్రయాణికులు ఫుల్ ఖుషీ అయ్యారు. ప్రస్తుతం కాచిగూడలో రోజుకు సగటున 40 మంది, సికింద్రాబాద్‌లో 70 మంది ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే రూ. వందల్లో ఖర్చయ్యే వైద్య పరీక్షలను కేవలం రూ.50 లకే అందజేస్తుండటంతో ప్రయాణికులకు ప్రయోజనకరంగా మారింది.