నిజమే ఈ రోజుల్లో చక్కెర లేకుండా ఉండటం చాలా కష్టం. మనం తినే ప్రతి ఆహారంలో, పానీయంలో చక్కెర వాడకం బాగా పెరిగిపోయింది. కానీ ఆరోగ్యానికి హాని కలిగించే ఈ చక్కెరను వదిలేయాలనుకునే వారికి, ఇప్పుడు కొత్తతరం స్వీటెనర్లు ఒక మంచి పరిష్కారంలా కనిపిస్తున్నాయి. వాటిలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు మాంక్ ఫ్రూట్ షుగర్ ఇది ఒక సహజసిద్ధమైన స్వీటైనర్. ఈ స్వీటెనర్లను ఉపయోగించడం ద్వారా మనం తియ్యని రుచిని ఆస్వాదిస్తూనే, చక్కెర వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. ఇవి సహజ పద్ధతులలో తయారు చేయబడతాయి. అసలు ఈ మాంక్ ఫ్రూట్ షుగర్ అంటే ఏమిటి? ఇది సహజంగా సురక్షితమైనదేనా? గుండె జబ్బులకు దారితీస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం..
మాంక్ ఫ్రూట్ అంటే:మాంక్ ఫ్రూట్ అనేది ఒక చిన్న గుండ్రని పండు. ఇది ప్రధానంగా ఆగ్నేయాసియాలో పెరుగుతుంది. ఈ పండును కొన్ని వందల సంవత్సరాల క్రితం బౌద్ధ సన్యాసులు మొదట ఉపయోగించారు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఈ పండు నుండి తీసిన స్వీటైనర్ జీరో క్యాలరీలు కలిగి ఉంటుంది. అయితే ఇది చక్కెర కంటే 100 నుండి 250 రెట్లు ఎక్కువ తీయగా ఉంటుంది. ఇందులో ఉండే తీయదనం మొగోసైడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాల వల్ల వస్తుంది. ఇది సాధారణ చెక్కెర లో ఉండే గ్లూకోజ్, ప్రక్టోర్స్ లాంటివి కలిగి వుండదు.

ఇది సహజంగా సురక్షితమైనదేనా: మాంక్ ఫ్రూట్ షుగర్ సురక్షితమైనదే అని అధ్యయనాలు చెబుతున్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రంగ్ అడ్మినిస్ట్రేషన్ కూడా దీనిని సాధారణంగా సురక్షితమైనదేగా గుర్తించింది. ఇది శరీరంలో జీవ క్రియకు ఎలాంటి ఆటంకం కలుగజేయదు కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. అందుకే డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఒక మంచి ప్రత్యామ్నాయంగా చెప్పొచ్చు.ఇది సహజం గా సురక్షితమైనది.
గుండె జబ్బులకు దారితీస్తుందా: ఇప్పటివరకు జరిగిన పరిశోధనల ప్రకారం మాంక్ ఫ్రూట్ షుగర్ గుండె జబ్బులకు దారితీస్తుందని రుజువు కాలేదు. నిజానికి ఇది ఆరోగ్యానికి మంచిది. అధిక చెక్కెర వినియోగం వల్ల కలిగే బరువు పెరగడం, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు గుండె జబ్బులకు ప్రధాన కారణాలు మాంక్ ఫ్రూట్ షుగర్ ఈ సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. దీనిలో సున్నా క్యాలరీలు ఉండడం వల్ల బరువు నియంత్రణలో సహాయపడుతుంది. ఇది పరోక్షంగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
అయితే మార్కెట్లో లభించే కొన్ని మాంక్ ఫ్రూట్ ఉత్పత్తుల్లో ఇతర క్యాలరీలు ఉన్న పదార్థాలు కృత్రిమ స్వీట్నర్లు కలిసి ఉండవచ్చు. వీటి వలన అనారోగ్య సమస్యలు రావచ్చు కాబట్టి కొనుగోలు చేసేటప్పుడు లేబుల్ చూసుకోవడం చాలా ముఖ్యం. మొత్తం మీద సహజమైన మాంక్ ఫ్రూట్ స్వీట్నర్ మన ఆరోగ్యానికి ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునే, వారికి ఒక సురక్షితమైన ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం.