పూర్తి ఆరోగ్యాన్ని పొందాలంటే తప్పకుండా ఎన్నో విషయాలను పాటించాలి. ఎప్పుడైతే మంచి ఆహారాన్ని తీసుకుంటారో అప్పుడే అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. సహజంగా ప్రతిరోజు తీసుకునేటువంటి ఆహారంలో ఉప్పుని ఎక్కువగా తీసుకోకూడదు అని వైద్యులు చెబుతూ ఉంటారు. ఉప్పుని ఎక్కువ మోతాదులో తీసుకుంటే రక్తపోటు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా శరీరంలో ఉప్పు తగ్గినట్లు అయితే రక్తపోటు కూడా పడిపోతుంది. దీనివలన గుండె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. పైగా శరీరంలో ఎప్పుడైతే సోడియం తగ్గిపోతుందో డిహైడ్రేషన్ కు గురవుతారు. ఈ విధంగా అనేక సమస్యలు తలెత్తుతాయి.
కాకపోతే శరీరానికి కొంత శాతం ఉప్పు కూడా అవసరం. ఉప్పు అంటే సోడియం క్లోరైడ్. దీనిని తీసుకోవడం వలన శరీరంలో ఎలక్ట్రోలైట్ గా పనిచేస్తుంది. అందువలన ఇది పోషకమే అని చెప్పవచ్చు. ఎప్పుడైతే శరీరానికి సరిపడా ఉప్పును తీసుకోరో ఎన్నో సమస్యలు కూడా తలెత్తుతాయి. ముఖ్యంగా హైపోనాట్రేమియా అనే వ్యాధిని ఎదుర్కొంటారు. దీంతో వికారం, వాంతులు వంటి లక్షణాలు కనబడతాయి. పైగా ఎంతో శక్తి కోల్పోయినట్టు అలసటగా ఉంటారు. ముఖ్యంగా ఈ సమస్య తీవ్రంగా మారితే మూర్చ వచ్చి కోమలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఎంతో జాగ్రత్త వహించాలి.
ఈ సమస్య ఎక్కువగా పెద్ద వయస్సు వారు ఎదుర్కొంటారు. అంతేకాకుండా మూత్ర విసర్జనకు మందులు తీసుకునే వారిలో ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి అని నిపుణులు చెబుతున్నారు. సహజంగా గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు, మూత్రపిండాల సమస్యలను ఎదుర్కొన్నవారు ఉప్పును తక్కువగా తీసుకుంటారు దీనివలన హైపోనాట్రేమియాను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక అవసరానికి మించి లేక చాలా తక్కువ మోతాదును కూడా తీసుకోకూడదు. అందువలన ఉప్పుని మితంగా తీసుకోవాలి అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.