శరీర దుర్వాసన చాలామందిని ఇబ్బంది పెట్టే ఒక సాధారణ సమస్య. దీనివల్ల మనం ఇతరులతో మాట్లాడటానికి కలవడానికి ఇబ్బంది పడతాం. ముఖ్యంగా ఎండ ఎక్కువగా వున్న టైం లో ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. చాలామంది ఈ సమస్యకు డియోడరెంట్లు పర్‌ఫ్యూమ్స్ వాడతారు. కానీ అవి కేవలం తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే. శరీర దుర్వాసనను సహజంగా పూర్తిగా తగ్గించడానికి మన ఇంట్లోనే కొన్ని అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం.
శరీర దుర్వాసనకు కారణాలు: శరీర దుర్వాసన అనేది చెమట వల్ల వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. మన శరీరంలో రెండు రకాల చెమట గ్రంథులు ఉంటాయి ఎక్రిన్ మరియు అపోక్రిన్ గ్రంథులు. అపోక్రిన్ గ్రంథులు విడుదల చేసే చెమటలో ప్రోటీన్లు, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఈ పదార్థాలు చర్మంపై ఉండే బ్యాక్టీరియాకు ఆహారంగా మారి అవి విచ్ఛిన్నం అయినప్పుడు దుర్వాసన వస్తుంది.
శరీర దుర్వాసనను తగ్గించే సహజ టిప్స్: మనం తినే ఆహారం కూడా శరీర దుర్వాసనపై ప్రభావం చూపుతుంది. వెల్లుల్లి, ఉల్లిపాయలు, కారంగా ఉండే ఆహారాలు రెడ్ మీట్ వంటివి ఎక్కువగా తింటే దుర్వాసన పెరగవచ్చు. కాబట్టి ఈ ఆహారాలు తగ్గించి ఆకుకూరలు పండ్లు ఎక్కువగా తీసుకోవడం మంచిది.

యాపిల్ సైడర్ వెనిగర్: యాపిల్ సైడర్ వెనిగర్‌కు యాంటీబాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఒక కాటన్ బాల్‌పై కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ వేసి చంకల్లో పూస్తే, బ్యాక్టీరియా వృద్ధిని తగ్గిస్తుంది.
బేకింగ్ సోడా: బేకింగ్ సోడా చెమటను గ్రహించి, దుర్వాసనను తగ్గిస్తుంది. కొద్దిగా బేకింగ్ సోడాను చంకల్లో రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
టీ ట్రీ ఆయిల్: టీ ట్రీ ఆయిల్‌లో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి. ఒక చెంచా నీటిలో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ కలిపి చంకల్లో రాస్తే, దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియా నశిస్తుంది.
రోజు స్నానం చేయండి: రోజూ రెండుసార్లు స్నానం చేయడం వల్ల చర్మంపై పేరుకుపోయిన బ్యాక్టీరియా, చెమట తొలగిపోతాయి.
శరీర దుర్వాసనను తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా పాటిస్తే మీరు ఆరోగ్యకరమైన తాజాగా ఉండవచ్చు. డియోడరెంట్లపై ఆధారపడకుండా ఈ పద్ధతులను అనుసరిస్తే దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుంది.