ప్రతి తల్లికి తన బిడ్డకు పాలు ఇవ్వడం ఒక మధురానుభూతి. నవ మాసాలు మోసి తన బిడ్డకు జన్మనివ్వగానే తల్లి ఎంతో సంతోషిస్తుంది. అంతకంటే రెట్టింపు సంతోషం ఆ బిడ్డకు పాలు ఇవ్వగానే తల్లికి కలుగుతుంది. తల్లిపాలు శిశువుకు దేవుడిచ్చిన వరం. ఇందులో శిశువు ఎదుగుదలకు, రోగనిరోధక శక్తికి అవసరమైన అన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే తల్లిపాలను అమృతంతో పోలుస్తారు. కానీ చాలామంది తల్లులు తమకు పాలు తగినన్ని రావడం లేదని ఆందోళన చెందుతారు. బిడ్డకి డబ్బా పాలు లేదా పొడి కలిపిన పాలన ఇవ్వడానికి సంకోచిస్తారు. మరి ఇలాంటి వారికి పాలు పెంచే ఆహారపు చిట్కాల ను ఇప్పుడు తెలుసుకుందాం..
సరైన ఆహారం: పాలిచ్చే తల్లులు పాల ఉత్పత్తిని పెంచేందుకు కొన్ని సహజమైన ఆహారాలు స్వీకరించాలి. వీటిని “గెలాక్టాగోగ్స్” అని అంటారు. పాల ఉత్పత్తిని పెంచే పదార్థాలలో ముఖ్యంగా చెప్పుకోదగినవి మెంతులు, జీలకర్ర, సోంపు గింజలు, మెంతి గింజలు లేదా మెంతి ఆకులు పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచుతాయి. మెంతి గింజలను రాత్రి నానబెట్టి ఉదయాన్నే తాగవచ్చు లేదా మెంతి ఆకులను వాడవచ్చు. ఇక జీలకర్ర కూడా పాల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. జీలకర్రను వేయించి పొడి చేసి మనం తినే ఆహారంలో కలుపుకోవచ్చు. ఇక అలాగే సోంపు గింజలు ఇవి జీర్ణక్రియకు సహాయ పడతాయి అంతేకాక పాల ఉత్పత్తిని కూడా మెరుగుపరుస్తాయి.
ఆకుకూరలు : ముఖ్యంగా మునగాకు, పాలకూర వంటి వాటిలో ఐరన్ క్యాల్షియం పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి పాల ఉత్పత్తికి ఎంతో అవసరం.

ప్రోటీన్లు, నీరు: పప్పులు, పాలు, గుడ్లు, చేపలు, నట్స్ (బాదం, జీడిపప్పు) వంటివి పాల ఉత్పత్తికి కావలసిన ప్రోటీన్లను అందిస్తాయి. ఇక అంతేకాక శరీరం హైడ్రేటెడ్ గా ఉండడం చాలా ముఖ్యం రోజు కనీసం మూడు లీటర్ల నీరు త్రాగడం వల్ల పాల ఉత్పత్తి మెరుగుపడుతుంది.
సరైన పద్ధతులు: శిశువుకి పాలు ఇవ్వడం అనేది తల్లులకు ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం. శిశువుకు ఎంత ఎక్కువగా పాలిస్తే శరీరంలో పాల ఉత్పత్తి అంత ఎక్కువ అవుతుంది. బిడ్డ ఆకలి సంకేతాలు కనిపించినప్పుడల్లా పాలు ఇవ్వాలి. మొదట 24 గంటల్లో కనీసం 8 నుంచి 12 సార్లు పాలు ఇవ్వడం మంచిది. ఇక ప్రతిసారి పాలిచ్చేటప్పుడు రెండు రొమ్ములు నుంచి పాలు ఇవ్వడం వల్ల పాలు తగినంత ఉత్పత్తి అవుతాయి.
ఇతర చిట్కాలు: డెలివరీ అయిన తర్వాత తల్లులకు కొంత ఆరోగ్యం సన్నగిల్లుతుంది. ఈ టైంలో శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్ గా ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండాలి. ఇక మానసిక ఒత్తిడి వల్ల పాల ఉత్పత్తికి అవసరమైన ఆక్సిటోసిన్ అనే హార్మోన్ తగ్గుతుంది.ఇక ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. తేలికపాటి సంగీతాన్ని వినడం, పుస్తకాలు చదవడం లేదా మీకు నచ్చిన పని చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
కొత్తగా తల్లి అయిన వారికి తగినంత విశ్రాంతి అవసరం శరీరానికి తగినంత విశ్రాంతి దొరికితేనే పాల ఉత్పత్తి మెరుగుపడుతుంది. తల్లిపాలు బిడ్డ ఎదుగుదలకు ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎంతగానో సహాయపడతాయి.
(గమనిక :పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహనా కోసం మాత్రమే, పాలు ఇచ్చే తల్లులు వైద్య నిపుణుని సంప్రదించండి.)