కరోనా సమయంలో గర్భవతులు తీసుకోవలసిన జాగ్రత్తలివే!

ప్రస్తుతం కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాధారణ వ్యక్తులు అయితే అధిక రోగనిరోధక శక్తి ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు కానీ గర్భవతులు అయితే మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. మరి కరోనా సమయంలో గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి అనే ఈ విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.

మహిళలు గర్భం ధరించిన మూడవ నెలలో ఒకసారి డాక్టర్ ను సంప్రదించి, ఆరోగ్య పరీక్షలు రక్తపరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. శిశువు హృదయ స్పందనను గుర్తించడానికి స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని పరీక్షలు నార్మల్ వస్తే తల్లి బిడ్డ ఆరోగ్యం కొరకు పోలిక్ యాసిడ్, క్యాల్షియం, మల్టీ విటమిన్ టాబ్లెట్స్ ను క్రమం తప్పకుండా వాడుతూ ఉండాలి. అలాగే సరైన పౌష్టికాహారం తీసుకోవాలి.

ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా శిశువు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. కరోనా సమయంలో గర్భవతులు రెట్టింపు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. వీలయినంత వరకు బయటకు రాకుండా ఉండడం చాలా ఉత్తమం. 5వ నెలలో పడిన తరువాత ఒకసారి డాప్లర్ స్కానింగ్ తప్పకుండా చేయించుకోవాలి. దీని ద్వారా శిశువు యొక్క పెరుగుదలను, వారిలో అవయవాల అభివృద్ధిని, గుర్తించడానికి ఈ డాప్లర్ స్కాన్ ఎంతో ఉపయోగపడుతుంది.

అలాగే హిమోగ్లోబిన్ శాతం, బిపి నార్మల్ గా ఉండేలా చూసుకోవాలి. ఐరన్, క్యాల్షియం టాబ్లెట్లను క్రమం తప్పకుండా తొమ్మిదవ నెల వరకు వాడాలి. మీకు ఏదైనా సమస్యగా అనిపించినా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. ఇదే పద్ధతిలో తొమ్మిది నెలల వరకు డాక్టరు అందుబాటులో ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలను పాటించడం ద్వారా కరోనా నుంచి కాపాడుకోవచ్చు.