చలికాలం వచ్చిందంటే పెద్దలకే కాకుండా పసిపాపలకు కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. వారి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన చల్లటి వాతావరణం, పొడి గాలి త్వరగా వారిని అనారోగ్యం పాలు చేస్తాయి. ముఖ్యంగా హైపోథెర్మియా (శరీర ఉష్ణోగ్రత పడిపోవడం) చర్మ సమస్యలు రాకుండా పసిబిడ్డలను కాపాడుకోవడం తల్లిదండ్రులకు అత్యంత ముఖ్యం. ఈ సూత్రాలు వారిని సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.
దుస్తులు, గది ఉష్ణోగ్రత: పసిపాప శరీర ఉష్ణోగ్రత త్వరగా పడిపోయే అవకాశం ఉంది, అందుకే వారిని వెచ్చగా ఉంచడం మొదటి ప్రాధాన్యత. పొరల పద్ధతి ఒక్క మందపాటి దుస్తులు కంటే, ఉష్ణోగ్రతను బట్టి సులభంగా తీయడానికి, వేయడానికి వీలుగా రెండు లేదా మూడు పలుచని పొరల దుస్తులు వేయడం ఉత్తమం. లోపలి పొర మెత్తటి కాటన్, బయటి పొర ఉన్ని లేదా ఫ్లీస్ ఉండేలా చూడండి.
చేతులు, పాదాలు, తల: చలి ఎక్కువగా కోల్పోయే ప్రాంతాలు ఇవే. అందుకే టోపీ (Cap), చేతి తొడుగులు (Mittens), సాక్సులు తప్పనిసరిగా వేయాలి. ముక్కు మాత్రం బయట ఉండేలా చూసుకోవాలి.
గది ఉష్ణోగ్రత: పసిపిల్లల గదిని 20 నుండి 22 డిగ్రీల సెల్సియస్ (సుమారు 68–72°F) మధ్య ఉండేలా చూసుకోవాలి. గదిలో గాలి ఆడేలా కొద్దిపాటి వెంటిలేషన్ ఉంచడం మంచిది. హీటర్ ఉపయోగిస్తే, అది శిశువుకు దూరంగా ఉండేలా చూసుకోండి.

చర్మ సంరక్షణ, ఆరోగ్యం: చలికాలంలో గాలిలో తేమ తగ్గిపోయి, పసిబిడ్డల సున్నితమైన చర్మం పొడిబారడం, పగలడం జరుగుతుంది.
స్నానం: ఎక్కువ సమయం స్నానం చేయించవద్దు. గోరువెచ్చని నీటిని ఉపయోగించి, స్నానం చేసిన వెంటనే తేలికపాటి, సువాసన లేని మాయిశ్చరైజర్ (Moisturizer) లేదా బేబీ లోషన్ అప్లై చేయండి. ఇది చర్మాన్ని డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది.
హైడ్రేషన్ (ద్రవాహారం): పాలు, ద్రవాహారం (అవసరమైతే డాక్టర్ సలహా మేరకు) తగినంత ఇస్తూ, శరీరం లోపల తేమ తగ్గకుండా జాగ్రత్త పడాలి. తల్లిపాలు తాగే పిల్లలకు చలికాలంలో కూడా తరచుగా పాలు ఇవ్వడం ఉత్తమం.
నిద్ర భద్రత: రాత్రి నిద్రలో దుప్పట్లు మొహంపై పడకుండా ఉండేందుకు, స్లీపింగ్ బ్యాగ్స్ లేదా స్విడిల్స్ ఉపయోగించడం సురక్షితం. అదనపు దుప్పట్లు వాడటం వల్ల ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది.
మీ శిశువులో నీలం రంగు పెదవులు, చల్లటి చర్మం, తీవ్రమైన నిద్రమత్తు వంటి లక్షణాలు కనిపిస్తే, అది హైపోథెర్మియాకు సంకేతం కావచ్చు. వెంటనే శిశువైద్యుడిని సంప్రదించి, అత్యవసర చికిత్స అందించడం చాలా అవసరం.
