పూర్తి ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారం ఎంత అవసరమో, సరైన నిద్ర మరియు విశ్రాంతి కూడా అంతే అవసరం. ఇది శరీరానికి మాత్రమే కాకుండా, మనస్సు ఒత్తిడి తగ్గించేందుకు కూడా ఎంతో సహాయపడుతుంది. కనుక ప్రతి రోజు మంచి నిద్రను పొందడం ఎంతో అవసరం. ఎప్పుడైతే సరైన నిద్రను పొందరో ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమి సమస్య వల్ల ఎన్నో లక్షణాలు గమనించవచ్చు. సరైన నిద్ర లేకపోతే మూడ్‌లో మార్పులు వస్తాయి. చిన్న విషయాలకే కోపం రావడం, భావోద్వేగాలను నియంత్రించలేకపోవడం వంటివి ఎదురవుతాయి.
అలాగే మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువగా కనిపిస్తాయి. నిద్రలేమి సమస్యను ఎదుర్కొన్నప్పుడు మెదడులో హార్మోన్ల సమతుల్యత కోల్పోయి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. చాలామంది సరైన నిద్ర లేని సమయంలో ఎక్కువ ఆకలి అనుభవిస్తారని భావిస్తారు. అయితే ఇది హార్మోన్ల ప్రభావమే. అధిక ఆకలి ఉన్నప్పుడు అధిక క్యాలరీలను తీసుకోవాలని శరీరం కోరుకుంటుంది. దీంతో తీపి పదార్థాలు, జంక్ ఫుడ్, ఇతర ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవాలనే కోరిక పెరుగుతుంది. ఈ విధంగా నిద్రలేమి వల్ల బరువు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సరైన నిద్ర లేకపోతే మెదడు మరియు శరీర స్పందనల పై ప్రభావం చూపుతుంది.
దీని వల్ల నెమ్మదిగా స్పందించడం, సరైన ఆలోచన విధానం లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కనుక రోజువారీ జీవితం పై నిద్రలేమి ప్రభావం పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యంగా జీవించాలంటే రోజుకు కనీసం 8 గంటల పాటు నిద్రపోవడం ఎంతో అవసరం. ఇలా నిద్రపోవడం వల్ల శరీరానికి విశ్రాంతి లభించడంతో పాటుగా మానసిక ఆరోగ్యం మెరుగుపడడం వంటి ప్రయోజనాలు ఉంటాయి. దీర్ఘకాలంగా నిద్రలేమి సమస్యతో బాధపడితే, కచ్చితంగా వైద్యులను సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలి.