సీఎం జగన్ ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఒకటి.. పోలీసులకు వీక్లీ ఆఫ్.. చెప్పినట్లుగానే ఆయన ఆ హామీని అమలు చేశారు కూడా. మొదటగా ఈ నెల 15వ తేదీన వైజాగ్‌లో ఈ నిర్ణయాన్ని అమలు చేశారు.
పోలీసు ఉద్యోగమంటే నిజంగా కత్తిమీద సామే. హోం గార్డు నుంచి డీజీపీ దాకా ప్రతి ఒక్క పోలీసు ఉద్యోగి, అధికారి.. రోజంతా అలర్ట్‌గా ఉండాలి. ఇక వీక్లీ ఆఫ్‌లు, సెలవులు ఉండవు. తమకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప వారు సెలవు తీసుకునేందుకు వీలు లేదు. అయితే ఇతర రాష్ట్రాల పోలీసుల పరిస్థితి ఏమో గానీ.. ఏపీ పోలీసులకు మాత్రం ఈ విషయంలో చాలా మేలే జరిగింది. ఎందుకంటే ఆ రాష్ట్ర సీఎం జగన్ తమ పోలీసులకు వీక్లీ ఆఫ్‌లను ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఏపీ పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం జగన్ ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఒకటి.. పోలీసులకు వీక్లీ ఆఫ్.. చెప్పినట్లుగానే ఆయన ఆ హామీని అమలు చేశారు కూడా. మొదటగా ఈ నెల 15వ తేదీన వైజాగ్‌లో ఈ నిర్ణయాన్ని అమలు చేశారు. ఆ తరువాత మరికొన్ని చోట్ల పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఇక త్వరలోనే ఏపీలో అన్నిప్రాంతాల పోలీసులకు వీక్లీ ఆఫ్‌లను ఇవ్వనున్నారు. అయితే ఇందుకు గాను మొదటగా శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో డీజీపీ గౌతం సవాంగ్, మరో 22 మంది పోలీసు అధికారులతో కలిసి ఈ నెల 4వ తేదీన ఓ కమిటీ వేశారు. వారు వీక్లీ ఆఫ్ అమలు చేస్తే ఎదురయ్యే ఇబ్బందుల గురించి చర్చించి చివరకు వీక్లీ ఆఫ్‌లను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలోనే వైజాగ్ పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా గత శనివారం ఆదేశాలు జారీ చేయడంతో ఆ నగరంలోని 2,147 మంది సివిల్, 850 మంది ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చారు. అయితే శాంతి భద్రతల విభాగంలో పనిచేసేవారికి మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది. సెక్షన్ డ్యూటీలో రోజుకు 8 గంటలు మాత్రమే డ్యూటీ చేసేవారు 3 రోజులు డ్యూటీ చేసి 36 గంటల పాటు విశ్రాంతి తీసుకుంటారు. అలాగే జనరల్ డ్యూటీ, వారెంట్లు, బందోబస్తు డ్యూటీలు చేసే పోలీసులకు వారంలో ఒక వీక్లీ ఆఫ్ ఉంటుంది.
ఇక ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవారిని 7 రోజులకు 7 భాగాలు చేస్తారు. అందరికీ వారంలో ఏదో ఒక రోజు వీక్లీ ఆఫ్ వచ్చేలా చూస్తారు. నేర పరిశోధన విభాగాన్ని 7 భాగాలుగా చేసి వీక్లీ ఆఫ్ ఇస్తారు. అలాగే ఆర్మ్‌డ్ రిజ్వర్ విభాగంలో గార్డు, సెక్యూరిటీ కంపెనీ విధులు నిర్వహించే వారికి పరిస్థితులకు అనుగుణంగా, సిబ్బంది కొరత లేకుండా వీక్లీ ఆఫ్‌లను ఇస్తారు. అలాగే అత్యవసర సమయాల్లో వీరు కచ్చితంగా విధులకు హాజరు కావల్సి ఉంటుంది. పోలీసు వాహనాలను నడిపే డ్రైవర్లకు వారి డ్యూటీలను బట్టి వీక్లీ ఆఫ్‌లు ఇస్తారు. ఈ క్రమంలోనే త్వరలో ఏపీ మొత్తం దశల వారీగా పోలీసులకు వీక్లీ ఆఫ్‌లను ఇవ్వనున్నారు..!