వేసవి కాలంలో బిజయ్ పాల్ అలా తన ఆటోపై గార్డెన్‌ను ఏర్పాటు చేసి ప్రయాణికులకు చల్లని నీడనివ్వడమే కాదు, చెట్లను కాపాడాలని చెబుతూ పర్యావరణ పరిరక్షకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
ఎండలు దంచి కొడుతున్నాయి. ఏప్రిల్ నెల ఆరంభంలోనే వేసవి చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే అధిక శాతం మంది ఎండ దెబ్బ బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక ముందు ముందు వేసవి ఎలా ఉండబోతుందోనన్న విషయం తలచుకుంటేనే భయమేస్తోంది. ఈ క్రమంలోనే పగటి పూట కాలు బయట పెట్టాలంటేనే జనాలు జంకుతున్నారు. ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. మండుతున్న ఎండలకు బయటకు వెళ్లలేకపోతున్నారు. అయితే ఆ ఆటోడ్రైవర్ మాత్రం ఎండకు భయపడాల్సిన పనిలేదని చెబుతూ తన ఆటోలో ప్రయాణికులకు చల్లని నీడను ఇస్తూ వినూత్న రీతిలో సేవలు అందిస్తున్నాడు. ఇంతకీ అతను ఎవరు, ఏం చేస్తున్నాడంటే..?
పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన బిజయ్ పాల్ అనే వ్యక్తి ఎన్నో ఏళ్లుగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇతను తన ఆటోలో ప్రయాణికులను గమ్యస్థానాలను చేరుస్తూ సేవలను అందించడమే కాదు, మరోవైపు పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతు బాధ్యతను కూడా నిర్వర్తిస్తున్నాడు. తన ఆటోపై చిన్నపాటి గార్డెన్‌ను ఏర్పాటు చేశాడు. అంతేకాదు, చెట్లను పరిరక్షించండి, పర్యావరణాన్ని కాపాడండి.. అనే ఓ సందేశాన్ని కూడా బెంగాలీలో తన ఆటోపై రాశాడు.
వేసవి కాలంలో బిజయ్ పాల్ అలా తన ఆటోపై గార్డెన్‌ను ఏర్పాటు చేసి ప్రయాణికులకు చల్లని నీడనివ్వడమే కాదు, చెట్లను కాపాడాలని చెబుతూ పర్యావరణ పరిరక్షకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు బిజయ్ పాల్ చూపిస్తున్న సామాజిక స్పృహకు అందరూ అతన్ని అభినందిస్తున్నారు. అంతేకాదు, బిజయ్ పాల్ బాటలోనే పర్యావరణ పరిరక్షణకు కొందరు నడుం బిగిస్తున్నారు. ఏది ఏమైనా బిజయ్ పాల్ చేసిన వినూత్న ఆలోచనకు, అందిస్తున్న సేవలకు అతన్ని నిజంగా అందరం అభినందించాల్సిందే..!