బాబు ఆ పసికందును తన సొంత కూతురిలాగే చూసుకున్నాడు. తన సొంత డబ్బులతో ఆ పాపకు చికిత్స చేయించడం మొదలు పెట్టాడు. అతనికి అప్పటికే ఇద్దరు సంతానం. అయినా ఆ పసికందును కూడా అతను చేరదీశాడు.
రోడ్డు మీద పోయే ఎవరికైనా అత్యవసర స్థితి వచ్చినప్పుడు వారి చుట్టూ ఉండే జనాల్లో ఎవరో ఒకరు కచ్చితంగా సహాయం చేస్తారు. హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స అందించేందుకు యత్నిస్తారు. అయితే ఎవరి సహాయం అయినా అక్కడికే పరిమితం అవుతుంది. కానీ ఆ ఆటోడ్రైవర్ మాత్రం నిజానికి అంతకన్నా ఎక్కువగానే చేశాడు. ఏకంగా 18 రోజుల పాటు హాస్పిటల్ చుట్టూ తిరిగాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారిని కాపాడుకునేందుకు శతవిధాలా యత్నించాడు. కానీ చివరకు ఆ పసికందు చనిపోయింది. ఈ హృదయ విదారకమైన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.
బెంగళూరులో నివాసం ఉండే బాబు ముద్రప్ప అనే 29 ఏళ్ల ఆటోడ్రైవర్ అక్కడి వైట్ ఫీల్డ్ రోడ్డులో ఆటోలో వెళ్తున్నాడు. అయితే అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ గర్భిణికి నొప్పులు మొదలవడంతో ఆమె అక్కడే రోడ్డుపై పడిపోయింది. చుట్టూ ఎవరూ లేరు. బాబు ఒక్కడే ఆటోలో ఉన్నాడు. అయితే ఆమె బాధను గమనించిన బాబు వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించాడు. అయితే కేసు క్లిష్టతరంగా ఉండడంతో ఆమెను సీవీ రామన్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు చెప్పారు. దీంతో ఆ గర్భిణిని బాబు సీవీ రామన్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడ ఆ మహిళ ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది.
అయితే నెలలు నిండకుండా పుట్టడంతో ఆ శిశువుకు శ్వాస కోశ సమస్యలు ఎదురయ్యాయి. దీంతో పక్కనే ఉన్న బౌరింగ్ పిల్లల ఆస్పత్రికి ఆ పసికందును తీసుకెళ్లాలని వైద్యులు చెప్పారు. ఈ క్రమంలో ఆ పసికందును బాబు ఆ హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స చేయించడం మొదలు పెట్టాడు. అయితే అతను తిరిగి వచ్చే సరికి ఆ మహిళ సీవీ రామన్ హాస్పిటల్‌లో లేదు. ఆమె వెళ్లిపోయిందని అక్కడి సిబ్బంది చెప్పడంతో బాబు షాక్ తిన్నాడు. అయితే ఆ మహిళ పేరు నందిత అని తెలిసింది. కానీ ఆమె ఉండే ఇంటి అడ్రస్, ఇతర వివరాలు బాబుకు తెలియలేదు.
అయినప్పటికీ బాబు ఆ పసికందును తన సొంత కూతురిలాగే చూసుకున్నాడు. తన సొంత డబ్బులతో ఆ పాపకు చికిత్స చేయించడం మొదలు పెట్టాడు. అతనికి అప్పటికే ఇద్దరు సంతానం. అయినా ఆ పసికందును కూడా అతను చేరదీశాడు. అయితే 18 రోజుల పాటు హాస్పిటల్‌లో చికిత్స పొందిన ఆ చిన్నారి అనారోగ్య సమస్యలతో పోరాడలేక చివరకు కన్ను మూసింది. దీంతో బాబు తీవ్రంగా కలత చెందాడు. అయితే అతను ఆ చిన్నారి కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టింది.. వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఏది ఏమైనా.. బాబు మానవతా హృదయానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అలాంటి వ్యక్తులు మనకు సమాజంలో ఎప్పుడో గానీ కనిపించరు కదా..!